Cyber Scam: “నా లాగా ఎవరూ మోసపోవద్దు.. బాబు జాగ్రత్త.. అయ్యో అనూష..”
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు మరింత పెరిగిపోతున్నాయి. మెసేజులు, ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లోన్ ఆఫర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇలా ఎన్నో రూపాల్లో జనాలను మోసం చేస్తూ నిత్యం ఏదో ఒకరిని బలి తీసుకుంటున్నారు.
Cyber Scam: “నా లాగా ఎవరూ మోసపోవద్దు.. బాబు జాగ్రత్త.. అయ్యో అనూష..”
సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు మరింత పెరిగిపోతున్నాయి. మెసేజులు, ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లోన్ ఆఫర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇలా ఎన్నో రూపాల్లో జనాలను మోసం చేస్తూ నిత్యం ఏదో ఒకరిని బలి తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన ఓ విషాద ఘటన అందరినీ కలిచివేసింది.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనూష అనే యువతి, కొద్ది రోజులుగా హైదరాబాద్ KPHBలోని తులసీనగర్‌లో భర్త వెంకన్న బాబు, కుమారుడితో కలిసి నివసిస్తోంది. టెలిగ్రామ్ యాప్‌లో "వర్క్ ఫ్రమ్ హోమ్" అంటూ వచ్చిన ఓ ప్రకటనను నమ్మి, ఉద్యోగం కోసం ఆశపడి అనూష ఆ లింక్‌ను ఫాలో అయింది. మొదట్లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టగా, ఆ యాప్‌లోకి కొన్ని వందల రూపాయలు వచ్చినట్లు చూపించారు. అయితే బ్యాంకు ఖాతాలోకి ఆ డబ్బులు బదిలీ కాలేదు.
ఇంకా ఎక్కువ డబ్బు పెట్టాలి అనే నెపంతో సైబర్ నేరగాళ్లు ఆమెను మోసగించారు. చివరికి అనూష తన దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి మొత్తం లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టింది. డబ్బు తిరిగి వస్తుందని ఆశించిన అనూషకు కాస్తసేపటికే మోసపోయానన్న నిజం అర్థమైంది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె, కుమారుడిని నిద్రపుచ్చిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో – “నా లాగా ఎవరూ మోసపోవద్దు… బాబు జాగ్రత్తగా ఉండాలి…” అని పేర్కొంది. ఈ ఘటనను బట్టే ఆమె బాధను ఊహించవచ్చు. లక్ష రూపాయలు మరియు బంగారం పోగొట్టుకున్న అనూష, అత్తింటివారి ఒత్తిడి భయంతోనే ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.