Dharmasthala: మిస్టరీ కొనసాగుతోంది.. 15 మానవ ఎముకలు, లోదుస్తులు లభ్యం.. తవ్వితే తవ్వితే బయటపడుతోన్న భయానక నిజాలు
Dharmasthala: మిస్టరీ కొనసాగుతోంది.. 15 మానవ ఎముకలు, లోదుస్తులు లభ్యం.. తవ్వితే తవ్వితే బయటపడుతోన్న భయానక నిజాలు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటకలోని ధర్మస్థల మిస్టరీ కేసులో ఒక్కొక్కటిగా పలు భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీక్షేత్ర ధర్మస్థల సమీప అటవీప్రాంతంలో గతంలో పలు మృతదేహాలను పాతిపెట్టినట్లు ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు చెప్పిన ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్న సిట్ బృందం, ఆరో ప్రదేశంలో మానవ అవశేషాలను గుర్తించింది. ఇప్పటివరకు ఇదే ఈ కేసులో బయటపడిన తొలి భౌతిక ఆధారం.
ఈ కేసులో ప్రధానంగా చెప్పిన 50 ఏళ్ల పారిశుద్ధ్య కార్మికుడు 1995 నుంచి 2014 మధ్యకాలంలో సుమారు 100కు పైగా మృతదేహాలను పాతిపెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. గత నాలుగు రోజులుగా అతడితో కలిసి 13 ప్రదేశాల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఆరో ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. అయితే, పుర్రె మాత్రం ఇంకా దొరకలేదు. లభ్యమైన అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
ఈ ఎముకలు 2003లో ధర్మస్థల శ్రీమంజునాథ ఆలయానికి వెళ్లిన తర్వాత అదృశ్యమైన అనన్య భట్‌కు సంబంధించివేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనన్య తల్లి సుజాత భట్ జూలై 15న పోలీసులకు ఫిర్యాదు చేయడం, డీఎన్‌ఏ పరీక్షలకు తాను సిద్ధమని చెప్పడంతో ఈ కోణంలో దర్యాప్తు వేగవంతమైంది. ఆమె తరఫు న్యాయవాది "సత్యమేవ జయతే" అంటూ ప్రకటన విడుదల చేశారు.
కేవలం అనన్య భట్ మాత్రమే కాదు, ధర్మస్థల ప్రాంతంలో పలు యువతులు, బాలికలు అదృశ్యమైనట్లు సమాచారం. వేదవల్లి, పద్మలత, ఓ 17 ఏళ్ల బాలికతో పాటు పాఠశాలకు వెళ్లే అనేక మంది అమ్మాయిలు కూడా కనిపించకుండా పోయారని, వారిని కూడా అక్కడే పాతిపెట్టినట్లు ఆ పారిశుద్ధ్య కార్మికుడు వెల్లడించాడు.
ఇక ఈ దర్యాప్తుతో ధర్మస్థల మిస్టరీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ పారిశుద్ధ్య కార్మికుడు గతంలో పాతిపెట్టిన మృతదేహాల చిత్రాలు, ఫోటోలు సమర్పించడంతో పోలీసులు, ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాయి. అసలు అంతమందిని పాతిపెట్టమని ఆదేశించిన వ్యక్తులు ఎవరు? వారిని పాతిపెట్టే సమయంలో సహకరించినవారు ఎవరు? అన్న అంశాలపై ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఆధారాలతో కేసు మరింత మలుపు తిరుగుతోంది.