జయరాం మర్డర్ కేసులో మరో ట్విస్ట్‌...సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

Update: 2019-02-06 06:44 GMT

ఏపీ పోలీసులపై జయరాం భార్య పద్మశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. కేసు దర్యాప్తులో ఏపీ పోలీసులు విఫలమయ్యారన్న పద్మశ్రీ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ పోలీసులను శిఖాచౌదరి ప్రభావితం చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తంచేశారు. 3 పేజీల లేఖతో జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చిన పద్మశ్రీ కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కావాలనే కేసును హైదరాబాద్‌ పరిధి దాటించారన్న పద్మశ్రీ నందిగామ పోలీసులను అడిగినా ఇంతవరకు పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వలేదన్నారు.

తాను అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చేసరికి జూబ్లీహిల్స్ హౌస్‌లో బెడ్రూమ్‌ బీరువా తెరిచి ఉందన్న పద్మశ్రీ చాలా విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. జయరాం హత్య జరిగాక ఆస్తుల కోసం శిఖాచౌదరి ప్రయత్నాలు చేసిందన్న పద్మశ్రీ రాకేష్ వ్యవహారాలు, శిఖా పాత్రపై దర్యాప్తు జరపాలని జూబ్లీహిల్స్‌ పోలీసులను కోరారు. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో జయరాం మర్డర్‌ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు మొత్తం తెలంగాణతో ముడిపడి ఉండటం అలాగే తెలంగాణ పోలీసుల ప్రమేయం ఉండటం జయరాం భార్య ఆరోపణల నేపథ్యంలో వివాదాలకు తావివ్వకూడదనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News