సోనియాగాంధీ సంచలన వ్యాఖ్యలు

Update: 2018-03-10 09:06 GMT

ఏఐసీసీ పగ్గాలను తనయుడికి అప్పగించి కాంగ్రెస్‌ వ్యవహారాల్లో తన పాత్రను తగ్గించుకున్న సోనియాగాంధీ తొలిసారి సహజశైలిలో మాట్లాడారు. మోడీ పరిపాలన, దేశంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలపై సంచలన కామెంట్స్‌ చేసిన సోనియా రాహుల్‌గాంధీ రాజకీయ సమర్ధతపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త స్టైల్‌ కావాలన్నారు.

రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాక సెలైంట్‌గా ఉంటూ వస్తోన్న సోనియాగాంధీ దేశంలో ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలపై సంచలన వ్యాఖ‌‍్యలు చేశారు. ఎప్పుడూ మాట్లాడే విధానానికి భిన్నంగా తనదైన శైలిలో సహజత్వంగా మాట్లాడిన సోనియా బీజేపీపైనా, మోడీపైనా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అలాగే తనయుడు రాహుల్‌గాంధీ రాజకీయ సమర్ధత, కాంగ్రెస్‌ పార్టీని నడుపుతున్న తీరుపైనా కీలక వ్యాఖ‌‍్యలు చేశారు.

మోడీ విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సోనియా ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, చర్చలు ఉంటాయని, కానీ ఏకపక్ష ధోరణి మంచిది కాదన్నారు. పార్లమెంట్‌ వ్యవహారాలపై వాజ్‌పేయికి అమితమైన గౌరవం ఉండేదని, అందుకే ఆయన హయాంలో పార్లమెంట్‌ కార్యకలాపాలు గౌరవప్రదగా ఉండేవన్నారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న సోనియా పార్లమెంట్‌ను మూసేస్తే తామంతా ఇంటికి వెళ్లిపోతాం కదా అంటూ తీవ్ర వ్యా‌‌ఖ్యలు చేశారు.

రాహుల్‌కి సలహాలిచ్చే ప్రయత్నం చేయబోనన్న సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేరువయ్యేందుకు మాత్రం నూతన శైలిని ఎంచుకోవాల్సిన అవసరమైతే కచ్చితంగా ఉందన్నారు. పార్టీకి నూతన జవసత్వాలు తేవడానికి యువ నేతలు, సీనియర్లతో సమతుల్యత సాధించాలన్నారు. రాహు‌ల్‌గాంధీ ఇంకా ప్రజల మద్దతు పొందాల్సిన కూడగట్టుకోవాల్సిన అవసరముందన్నారు. ఇక ప్రియాంక గురించి కూడా మాట్లాడిన సోనియా ఆమె ప్రస్తుతం తన పిల్లల బాధ్యతల్లో బిజీగా ఉందన్నారు, అయితే భవిష్యత్‌ ఎలాగుంటుంటో ఇప్పుడే ఎలా చెప్పగలమన్నారు.

ఈ నాలుగేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు బీజేపీ తప్పుడు ప్రచారం చేసుకుంటోందన్న సోనియా అంతకముందు ఏమైనా దేశం అగాథంలో కూరుకుపోయిందా అంటూ ప్రశ్నించారు. 
మోడీ పాలనలో అసహనం పెరిగిపోయింది, న్యాయవ్యవస్థ సంక్షోభంలో పడింది, భయం, బెదిరింపులు, మత ఘర్షణలు పెరిగాయి, వ్యక్తిగత స్వేచ్ఛ వేధింపులకు గురవుతోందన్న సోనియా ప్రజలను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకునేందుకు ప్రతీ పథకానికీ ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దేశం తిరోగమనంలో ఉందన్న సోనియా 2019లో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామన్నారు.

Similar News