రామ బాణం... తగిలేది ఎవరికి?

Update: 2018-05-02 10:57 GMT

ఆయన పేరు సమ్మోహనం. ఆయన మాట సంచలనం. ఆ మహానేత పేరెత్తితే జనం గుండెలు ఉప్పొంగుతాయి. ఆత్మగౌరవంతో మండుతాయి. ఆయన మాట, బాట నచ్చే, తొమ్మిది నెలల్లో, ప్రజలు అధికార తిలకం దిద్దారు. ఆయనెవరో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అవును ఆయన నటసార్వభౌముడు, ప్రజానాయకుడు నందమూరి తారక రామారావు. ఆయన బాటలో ఎంతమంది నడుస్తున్నారో తెలీదు కానీ, ఆయన పేరును మాత్రం కొన్ని దశాబ్దాలుగా నాయకులు బాగానే వాడుకుంటున్నారు. చంద్రబాబు నుంచి నేటి జగన్‌ వరకు, ప్రతి ఒక్కరూ ఆయన జపం చేస్తున్నారు. ఇప్పుడు జగన్‌ ఏకంగా ఓ సంచలన ప్రకటనే చేశాడు...

ఒకవైపు తెలుగుదేశం ధర్మపోరాట దీక్ష. మరోవైపు దీనికి కౌంటర్‌ అన్నట్టుగా వంచన వ్యతిరేక దీక్ష. ప్రత్యేక హోదా సమరం సాక్షిగా, అవిశ్వాసాలు, రాజీనామాలు, ఇలా టామ్‌ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్నాయి తెలుగుదేశం, వైసీపీ. ఇప్పుడు జగన్‌ ఆ పోటీని పతాకస్థాయికి అన్నట్టుగా, ఏకంగా రామ బాణమే సంధించాడు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతామని, ఎన్టీఆర్‌ పుట్టిన ఊరు నిమ్మకూరు సాక్షిగా సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ చేశాడు జగన్. ఎన్టీఆర్ పేరెత్తడం ద్వారా, టీడీపీని ఇబ్బందిలోకి పెట్టే ప్రయత్నమా? 

ఎన్టీఆర్‌పై జగన్‌ వ్యూహమేంటి....ప్రత్యర్థి పార్టీ వ్యవస్థాపకుడిపై ప్రశంసల వెనక పరమార్థమేంటి...అన్నగారిని పొగిడి, చంద్రబాబును తెగడటం వెనక మతలబు ఏంటి...కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలనడం నుంచి అదేపనిగా ఎన్టీఆర్‌ గురించి మాట్లాడం వరకు వైఎస్ జగన్ స్ట్రాటజీ ఏంటి? టీడీపీ ఎలా స్పందస్తోంది? ఒక పార్టీకి ప్రతీకలైనవారిని, మరొక పార్టీ, అందులోనూ ఒక ప్రత్యర్థి పార్టీ తమవైపు తిప్పుకోవడం చరిత్రలో కొత్తేం కాదు. అశేష అభిమానం ఉన్న మహానాయకులను సొంతం చేసుకోవాలని అధికారంలో ఉన్న చాలామంది ప్రయత్నం చేశారు. 2014లో ఢిల్లీ గద్దెనెక్కిన తర్వాత, నరేంద్ర మోడీ కూడా కాంగ్రెస్‌ ఐకాన్లపై పొగడ్తల వర్షంకురిపించి, వారి త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది అంటూ ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం వ్యవస్థాపకుడిని, తమ సొంతం చేసుకునేందుకో, టీడీపీ నుంచి వేరు చేసేందుకో, వైసీపీ చాలా గట్టి ప్రయత్నమే చేస్తోంది. పార్టీలకు అతీతంగా గొప్ప వ్యక్తులను స్మరించుకుంటున్నారా...రాజకీయమే అసలైన అజెండానా?
 

Similar News