వెంకన్న దర్శనభాగ్యం ఇక సులువే!!

Update: 2018-05-03 10:48 GMT

తిరుమల భక్తులకు కచ్చితంగా ఇది శుభవార్తే. శ్రీవారి సర్వదర్శనంలో టైమ్‌స్లాట్‌ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఆధార్‌ లేదా ఓటరు ఐడీతో భక్తులకు ఉచిత దర్శనం టోకెన్లు జారీచేసే విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుగ్గానూ సివిల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటరీకరణ ఏర్పాట్లు కూడా పూర్తిచేసింది. టైమ్‌స్లాట్‌ విధానం అందుబాటులోకి వస్తే సూచించిన సమయానికి భక్తులు క్యూలోకి వస్తే సరిపోతుంది. సప్తగిరులపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2013లో రూ.300 టిక్కెట్లకు టైమ్‌స్లాట్‌ను ప్రారంభించిన అధికారులు... 2017లో కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనంలో టైమ్‌స్లాట్‌ను అమలు చేసి విజయవంతం చేశారు. గతేడాది డిసెంబరు 18 నుంచి 23 వరకు సర్వదర్శనంలో టైమ్‌స్లాట్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించి... చివరకు దాన్ని అమల్లోకి తెచ్చింది.

ఉన్నత ప్రమాణాలతో ఏకరూప కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, కుర్చీలు, టాయిలెట్స్‌ ఉంటాయి. టైమ్‌స్లాట్‌ టోకెన్ల ఖాళీల వివరాలను తెలిపేందుకు డిస్‌ప్లే స్ర్కీన్లు పెడుతున్నారు. అవగాహన లేని భక్తుల కోసం రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ఉంటాయి. దివ్యాంగుల కోసం ప్రతి కేంద్రంలో ఒక కౌంటర్‌ కాస్త దిగువకు ఉంటుంది. 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున వారికి ఆధార్‌ లేక ఐరీష్ స్వీకరణ ద్వారా టోకెన్లు ఇవ్వనున్నారు. 18 ఏళ్లు దాటిన భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ లేక ఓటరు కార్డును తీసుకెళ్లాల్సిందే. లేకుంటే టోకెన్‌ దొరకదు. బారులు లేని తిరుమలే లక్ష్యంగా క్యూలైన్లలో భక్తుల బాధలు గమనించే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. టోకెన్లపై నమోదైన సమయానికి వస్తే 2 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇకపై క్యూలైన్లు వెలుపలకు వచ్చే ప్రసక్తే ఉండదని ఆయన చెప్పారు. టోకెన్ల కోసం భక్తులు ఆధార్‌ లేదా ఓటరు ఐడీ ఇవ్వాలి. ఒకసారి టోకెన్‌ స్వీకరిస్తే 15 రోజుల వరకూ తిరిగి టోకెన్‌ పొందే అవకాశం ఉండదు. ఒక రోజులో మూడు వందల రూపాయలు, దివ్యదర్శనం టోకెన్‌ కలిగి ఉంటే సర్వదర్శన టైమ్‌స్లాట్‌ పొందడానికి వీలుండదు. ఒకవేళ భక్తుడు పట్టుబడితే ముందుగా పొందిన టోకెన్లు రద్దు అవుతాయి. 

Similar News