కమెడియన్ గుండు హనుమంతరావు కన్నుమూత

Update: 2018-02-19 04:48 GMT

తెలుగు సినీ పరిశ్రమ.. మరో కమెడియన్ ను కోల్పోయింది. ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతారావు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో.. కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

సుమారు 400 లకు పైగా సినిమాల్లో నటించిన గుండు హనుమంతారావు.. తనదైన ప్రత్యేకమైన హాస్యంతో పరిశ్రమలో పేరు సంపాదించాడు. సినిమాల్లోకి రాకముందు మిఠాయిల వ్యాపారం చేసే హనుమంతారావుకు.. నాటకాలంటే ఎక్కువగా ఇష్టపడేవారు. ఒకసారి మద్రాస్ లో ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల.. అహ నా పెళ్లంట సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చారు. అప్పటి నుంచి సినిమాల్లో ఆయనకు అవకాశాలు వచ్చి పడ్డాయి. 

రాజేంద్రప్రసాద్  హీరోగా చేసిన చాలా చిత్రాల్లో గుండు హనుమంతారావు కమెడియన్ గా మంచి గుర్తింపు పొందారు. బ్రహ్మానందంతో కలిసి.. సినిమాల్లో హాస్యాన్ని పండించారు. 90 దశకంలో వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా కనిపించారు. అయితే గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈ మధ్యే ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. అయితే ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో.. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా డబ్బులు లేని విషయాన్ని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా మెరుగైన చికిత్స కోసం సహకారం అందించింది. సీఎం సహాయ నిధి కింద.. 5 లక్షలను అందించడమే కాకుండా.. అవసరమైన సాయాన్ని కూడా అందజేస్తామని ప్రకటించింది. 

1956 అక్టోబర్ 10 న విజయవాడలో జన్మించిన గుండు హనుమంతారావుకు సినిమాలే కాకుండా.. తెలుగు పాప్యులర్  సీరియల్ అమృతం కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. ఇటు ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న సహ నటులు.. హనుమంతరావు స్వగృహానికి తరలివస్తున్నారు. 
 

Similar News