వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ ...2019 నాటికి...

Update: 2018-12-25 07:28 GMT

2019 నాటికి టీఆర్ఎస్‌ను దేశంలో బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం కేసీఆర్ వ్యూహాత్మక పర్యటనలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్టాల వారిగా ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చలు సాగించిన కేసీఆర్ ఢిల్లీ వేదికగా కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉత్తరాదిలో కాంగ్రెస్‌, బీజేపీలతో విభేదించే పార్టీలతో మూడు రోజుల పాటు చర్చలు జరపనున్నారు. దేశంలోనే అత్యధిక స్ధానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రాంతీయ శక్తులుగా ఉన్న ఎస్పీ, బీఎస్పీ  అధినేతలతో కేసీఆర్‌ భేటి కానున్నారు. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల దృశ్యా  కాంగ్రెస్‌, బీజేపీలకు పూర్తి స్థాయి మెజార్టీ రాదని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలోనే భావసారుప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి వస్తే జాతీయ పార్టీలను ప్రభావితం చేయవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. 

దేశ రాజధానిలో మూడు రోజుల పాటు మకాం వేయనున్న కేసీఆర్ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించనున్నారు. ఫ్రంట్ ఆవశ్యకతను వివరిస్తూ కూటమిలోకి రావాలంటూ ఆహ్వానించనున్నారు. దీంతో పాటు రేపు సాయంత్రం  ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో  భేటి కానున్నారు. విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులు, సాగు నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్ధాపన అంశాలపై చర్చలు జరపనున్నారు. వీటితో పాటు కేంద్ర ఎన్నికల సంఘంతో కూడా కేసీఆర్ భేటి కానున్నారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కారు గుర్తు తరహాలో ట్రక్ ఉండటంతో  ఓటర్లు తికమకపడ్డారంటూ వివరించనున్నారు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో కారును పోలిన గుర్తు ఇవ్వకుండా చూడాలంటూ వినతిపత్రం ఇవ్వనున్నారు. 

Similar News