ఇంటి నుంచి గెంటేయడంతో భర్తపై పోరాటం సాగిస్తున్న సంగీతపై మరోసారి దాడి జరిగింది. ఆమె తమ్ముడు ఇంటికి వచ్చాడన్న కారణంతో అత్తమామలు, మరిది దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడంతో సంగీత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. భర్త ఇంట్లో ఉండాలని, ఆమె ఖర్చులకు నెలకు రూ.20 వేలు చెల్లించాలని ఇటీవల ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. దీంతో ఆమె బోడుప్పల్ శ్రీనగర్ కాలనీలో భర్త, టీఆర్ఎస్ మాజీ నేత కె.శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఉంటున్నారు.
కోర్టు ఆదేశాలతో ఇంట్లోకి వెళ్లి ఉంటున్న సంగీతకు అప్పటి నుంచీ అత్తామామలైన పులకండ్ల బాల్‌రెడ్డి, ఐలమ్మ, మరిది శ్రీధర్‌రెడ్డి మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. అన్నింటినీ తట్టుకుని న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదనే ధృఢ నిశ్చయంతో అదే ఇంట్లో పరాయి మనిషిలా చిన్న గదిలో ఉంటోంది. సంగీత ఎంతకీ ఇంటి నుంచి వెళ్లకపోవడంతో మామ పులకండ్ల బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌రెడ్డి ఆదివారం సాయంత్రం తాగొచ్చి సంగీతను, ఆమె తమ్ముడిని నానా దుర్భాషలాడుతూ మరోసారి బయటకు కొట్టి గెంటేశారు. ఆడపిల్ల అని చూడకుండా జుట్టు పట్టుకుని గోడకేసి కొట్టి ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారని ఫోన్లు పగులగొట్టారు. దీంతో భయపడిన సంగీత హుటాహుటిన పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు సంగీత మామ బాల్‌రెడ్డి, మరిది శ్రీధర్‌రెడ్డిల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.