రాజస్థాన్‌లో వాడిపోయిన కమలం

Update: 2018-12-12 02:31 GMT

రాజస్థాన్‌లో ఎన్నికల ఆనవాయితీని మార్చి కొత్త చరిత్ర లిఖించాలన్న కమలం కలలు కల్లలే అయ్యాయి. పక్కా వ్యూహంతో ముందుకెళ్లిన కాంగ్రెస్‌ పార్టీనే విజయం వరించింది. రాజస్థాన్ లో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం రావడంతో నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బొటాబొటి మెజారిటీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. రాజస్తాన్‌ అసెంబ్లీలోని 200 సీట్లకు గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అల్వార్‌ జిల్లాలోని రామ్‌గఢ్‌ నియోజకవర్గం బీఎస్‌పీ అభ్యర్ధి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక వాయిదా వేశారు. ఇక నిన్న ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్‌ 99, బీజేపీ 73 వరకు సీట్లు గెలుచుకున్నాయి. బీఎస్పీ 6 , ఇతరులు 21 మంది గెలుపొందారు. 

ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖుల్లో కొందరు గెలవగా, మరికొందరు ఓడిపోయారు. ముఖ్యమంత్రి వసుంధరరాజే ఝల్రాపటాన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్, యంగ్ టర్క్‌ సచిన్ పైలట్‌లు తమ నియోజకవర్గాల్లో గెలుపొందారు. సర్దార్‌పురా నుంచి బరిలో నిలిచిన అశోక్ గెహ్లాట్‌ కూడా 50 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టోంక్ నుంచి సచిన్ పైలట్ 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్లామయ్ ఆదర్శ్ నగర్‌ నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యారు.

రాజస్థాన్‌లో ఓటమిని బీజేపీ నాయకత్వం అంగీకరించింది. ప్రజలు మార్పు కోరుకున్నారని, అదే తమకు విజయం కట్టబెట్టిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. కాగా ఫలితాలు స్పష్టం కావడంతో నేడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా జైపూర్‌లో సమావేశమై తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు.

Similar News