ఎంపీ జేసీ తీరుపై తీవ్రంగా స్పందించిన పోలీస్ అధికారుల సంఘం

Update: 2018-09-21 02:18 GMT

 'ఏ పార్టీ వారైనా, ఏ నాయకుడైనా... పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక తెగ్గోస్తాం. మేమూ రాయలసీమ బిడ్డలమే. మాకూ పౌరుషం ఉంది. మగాళ్లం కాబట్టే పోలీసు వ్యవస్థలోకి వచ్చాం! ఈ వ్యవస్థలో పని చేస్తున్నాం. తస్మాత్‌ జాగ్రత్త.. అంటూ సాక్షాత్తు పొలిసు అధికారుల సంఘం సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ పరోక్షంగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల అనంతపురంలో స్వామి ప్రభోధానంద అనుచరులు, కొందరు టీడీపీ కార్యకర్తలకు జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. దాంతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభోధానంద ఆశ్రమానికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ శాంతిభద్రతలు  తలెత్తే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు ఆయనను మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ.. పోలీసులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.పైగా అనంతపురం పోలీసుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే ఎంపీ జేసీ ఆరోపణలపై పొలిసు అధికారుల సంఘం స్పందించింది. అక్కడక్కడ జరిగే చిన్నపాటి తప్పిదాలకు మొత్తం వ్యవస్థనే కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. రాజకీయ నాయకులు ఎక్కడా, ఎప్పుడూ విఫలం కాలేదా?’ అని నిలదీశారు. కానిస్టేబుల్‌ నుంచి అత్యున్నతస్థాయిలో డీజీపీ వరకు పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో తెలుసుకుని మాట్లాడాలని పొలిసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు. 

Similar News