బీజేపీ ఆఫీస్‌పై పెట్రోల్ బాంబు దాడి

Update: 2018-03-07 05:55 GMT

త్రిపురలో లెనిన్‌ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటనను మరువకముందే తమిళనాడులోని వెల్లూర్‌లో పెరియార్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో ఇక్కడ కూడా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత హెచ్‌ రాజా కొన్ని గంటల క్రితం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్టు చేశారు. లెనిన్‌ విగ్రహం లాగే సంఘ సంస్కర్త అయిన పెరియార్ రామస్వామి విగ్రహాన్ని కూడా తొలగించాలని ఆ పోస్టు సారాంశం. దీంతో ఈ పోస్టు చేసిన కొద్ది గంటలకే వెల్లూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న పెరియార్‌ విగ్రహాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. 

పెరియార్ విగ్రహంపై దాడి విషయం తెలుసుకున్న మరికొందరు కొయంబత్తూర్‌లో బీజేపీ కార్యాయలంపై కొందరు వ్యక్తులు పెట్రోల్‌ బాంబులు విసిరారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఘటనకు కారకులుగా భావిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. విగ్రహం కళ్లు, ముక్కు దెబ్బతిన్నాయని, ఓ బీజేపీ కార్యకర్త, మరో సీపీఐ కార్యకర్త మద్యం మత్తులో ఈ పని చేశారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. పెరియార్ రామస్వామి విగ్రహం ధ్వంసంపై తమిళ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నిరసనలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

మరోవైపు కోల్‌కతాలో శ్యాంప్రసాద్ ముఖర్జీ విగ్రహంపైనా కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈశాన్య రాష్ట్రల్లో అధికారంలోకి వచ్చామన్న ఆనందంలో ఉన్న బీజేపీ శ్రేణులు పలు రాష్ట్రాల్లో విగ్రహాల విధ్వంసానికి పాల్పడటం ఆందోళనకు గురిచేస్తోంది. త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత వరుసగా కోయంబత్తూర్, కోల్‌కతాలో దాడులకు పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 

అయితే లెనిన్‌, పెరియార్‌ విగ్రహాల ధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడిన ప్రధాని దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల చోటుచేసుకున్న విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆమోదయోగ్యం కావన్నారు. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనల గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు.   

Similar News