చింతమనేని, జగన్ లపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన జనసేనాని

Update: 2018-09-27 02:24 GMT

ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక వీధి రౌడీలా, ఆకు రౌడీలా, చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నారు. అలా వ్యవహరించే వ్యక్తిని ప్రభుత్వ విప్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా నియమించారో అని సందేహించారు. అతను ఏం చేసినా సీఎం మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. ఆయనంటే చంద్రబాబుకు సైతం భయం వేస్తున్నట్లు ఉందన్నారు. అధికారంలో ఉన్న పాలకులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఉంటుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడం, చురుగ్గా ఉండే జనసైనికులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలను నిలిపివేయడం వంటి కక్షపూరిత చర్యలు దారుణమన్నారు. రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నా విపక్ష నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజల తరుపున అధికార పార్టీని నిలదీయడానికి ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Similar News