చల్లటి వార్త... భానుడి భగభగలు ఇంకొన్నాళ్లే!!

Update: 2018-05-29 06:00 GMT

భానుడి భగభగల నుంచి తెలుగు ప్రజలకు మరొకొన్ని రోజుల్లోనే ఉపశమనం కలగనుంది. నేటి రాత్రి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 7న తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. 

నైరుతి రుతు పవనాల రాక మొదలయింది. నేటి రాత్రి కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు అటునుంచి తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్రల మీదుగా తెలంగాణ రాష్ట్రానికి రానున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు, శ్రీలంక ప్రాంతాలను తాకాయి. ఆ తర్వాత ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

నైరుతి రుతు పవనాలు నేడు కేరళ తో పాటు దక్షిణ అరేబియా సముద్రం, లక్షదీవుల్లోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది జూన్ -సెప్టెంబర్ మధ్య కాలంలో సాధారణ వర్షపాతం నమోదౌతుందని, అస్థిర పరిస్థితులేవీ లేనందున వర్షపాతానికి ఈ ఏడాది ఢోకా ఉండదని వాతావరణ శాఖ తెలిపింది.

రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించే వరకు ఎండల తాకిడి తప్పదని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర నమోదౌతున్నాయి. ఎండల ధాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు ఎండ తీవ్రత, ఉక్కపోత ఉండడం ఖాయమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయట తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జూన్ 7 తర్వాత రుతుపవనాల పలకరింపుతో వాతావరణం చల్లబడనుంది. 

Similar News