కర్ణాటకలో క్యాబినెట్ కూర్పు చిచ్చు.. బాంబు పేల్చిన యడ్యూరప్ప

Update: 2018-06-10 01:50 GMT

కర్ణాటకలో క్యాబినెట్ కూర్పు  పూర్తయిందో లేదో  అసంతృప్తి నేతలు రగిలిపోతున్నారు. మంత్రి పదవులు దక్కని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు  ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్‌ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్‌ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్‌ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చిచ్చుపెట్టింది.

అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్యను జీటీ దేవెగౌడ ఓడించారు. పుట్టరాజు లోక్‌సభకు రాజీనామా చేసి మెల్కొటే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. వారిద్ద్దరు రవాణా వంటి కీలక శాఖను ఆశించారు. ఆ శాఖను తమకు కేటాయించకుడా.. జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ బంధువు డీసీ తమ్మన్నకు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు. 

ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత,  ఎంబీ పాటిల్‌ తనకు మంత్రి పదవి  దక్కుంతుందనే ఆశలు పెట్టుకున్నారు.. కానీ ఆయనకు నిరాశయే మిగలడంతో అయన  నేతృత్వంలోని అసంతృప్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 'రాహుల్‌తో  సమావేశమయ్యారు.. అనంతరం ఆయన మీడియాతో  మాట్లాడుతూ..' నా అభిప్రాయాల్ని రాహుల్‌తో పంచుకున్నాను.   ప్రత్యేకంగా ఏమీ డిమాండ్‌ చేయలేదు. సమావేశ వివరాలపై మిగతా 15–20 మంది ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం' అని సమాధానమిచ్చారు. 

ఇదిలావుంటే మంత్రి పదవులు దక్కని కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ తో టచ్ లో ఉన్నట్టు ప్రతిపక్షనేత యడ్యూరప్ప బాంబ్ పేల్చారు. దీంతో ఏ క్షణానికి ఏమి జరుగుతుందోనని సీఎం కుమారస్వామి  టెన్షన్ తో ఉన్నారు.  అందుబాటులో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

Similar News