నాలుగు జిల్లాల్లో కేసీఆర్ సుడిగాలి ప్రచారం

Update: 2018-11-21 05:19 GMT

విపక్షాల మీద విమర్శలు నాలుగున్నర ఏళ్ళలో చేసిన అభివృద్ధి పనులు అధికారంలోకి వస్తే చేయబోయే పనులను హైలెట్ చేస్తూ గులాబీ బాస్ క్యాంపెయినింగ్‌ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కేసీఆర్ రెండో రోజు నాలుగు గంటల్లో నాలుగు జిల్లాలను చుట్టేశారు. ఒకే రోజు నాలుగు సభల్లో పాల్గొని కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఆయా నియోజకవర్గాల గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. సుడిగాలి పర్యటనలు చేస్తూ ఒకేరోజు నాలుగైదు జిల్లాలను చుట్టేస్తున్నారు. సోమవారం నుంచి మలి విడత ప్రచారాన్ని చేపట్టిన కేసీఆర్‌ కేవలం రెండు రోజుల్లోనే ఆరేడు ప్రచార సభల్లో పాల్గొన్నారు. మంగళవారం ఒక్కరోజే 4 జిల్లాలను చుట్టేసిన కేసీఆర్‌ కేవలం 4 గంటల్లోనే సిద్దిపేట, హుజురాబాద్‌, సిరిసిల్ల, కామారెడ్డి సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తాను సిద్దిపేట పెంచిన బిడ్డనేనని, ఇదే మట్టిలో పెరిగిన వాడినంటూ సిద్దిపేట సభలో కేసీఆర్ లోకల్ సెంటిమెంట్‌ అస్త్రాన్ని ప్రయోగించారు. దేశంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న కేసీఆర్ పొరపాటున మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్లీ చీకటి రోజులు వస్తాయంటూ హుజురాబాద్‌ సభలో అన్నారు కేసీఆర్. ఇక సిరిసిల్ల సభలో కాంగ్రెస్‌, టీడీపీపై కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. తమ హయాంలో ప్రభుత్వాదాయం భారీగా పెరిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో IKP మహిళలను శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని కామారెడ్డి సభలో కేసీఆర్ హామీ ఇచ్చారు. 

ఇక ఈరోజు కూడా ఐదారు బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గోనున్నారు. ఇవాళ జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్‌, భువనగిరి, మెదక్‌‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే రేపు ఖానాపూర్‌, ఇచ్చోడ, నిర్మల్‌, ముథోల్‌, ఆర్మూరు సభల్లో పాల్గోనున్నారు. ఇక 23న నర్సంపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామలో ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. అలాగే 25న తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం సభల్లో పాల్గొని ఎన్నికల క్యాంపెయిన్ చేయనున్నారు. మొత్తానికి ఈ రెండు మూడు రోజుల్లోనే దాదాపు 20కి పైగా బహిరంగ సభల్లో పాల్గొని కేసీఆర్ ప్రసంగించనున్నారు.

Similar News