రెండోసారి సీఎంగా కేసీఆర్‌ ప్రమాణస్వీకారం

Update: 2018-12-13 15:39 GMT


తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. కేసీఆర్ తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ తో పాటు మహముద్ అలీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా అతి సాధారణంగా ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది.

టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు... రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంటా 25 నిమిషాలకు గవర్నర్‌ నరసింహన్‌... కేసీఆర్‌‌తో ప్రమాణం చేయించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అను నేను అంటూ కేసీఆర్‌‌ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం సభికులకు కేసీఆర్ వినమ్రంగా నమస్కారం చేశారు. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్... రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మహమూద్‌ అలీ మంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. మహమూద్‌ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. 

ప్రస్తుతానికి కేసీఆర్‌, మహమూద్‌ అలీలు మాత్రమే ప్రమాణం చేశారు. రాజ్‌‌భవన్‌ దర్భార్ హాల్లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు పెద్దఎత్తున హాజరయ్యారు. దాంతో ఉదయం నుంచి ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసేవరకూ రాజ్‌భవన్‌‌ పరిసరాలు సందడి సందడిగా కనిపించాయి.

Similar News