నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో...పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి...

Update: 2018-10-16 05:18 GMT

ఎన్నికల ప్రచారంలో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతున్న గులాబీ దళం మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పలు వర్గాల నుంచి విజ్ఞప్తులు, సలహాలు, సూచనలు సేకరించిన కమిటీ ఈరోజు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మీటింగ్‌కి గులాబీ బాస్‌ కేసీఆర్‌ కూడా హాజరుకానుండటంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, రైతులు, బడుగు బలహీనవర్గాలను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపకల్పన ఉండనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ భవన్‌లో ఈరోజు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్‌కి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఇప్పటివరకు వివిధ వర్గాల నుంచి, ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులు, డిమాండ్లపై చర్చించనున్నారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఏకకాలంలో రుణమాఫీ వంటి హామీలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

అయితే పూర్తి మేనిఫెస్టో సిద్ధమయ్యేలోపు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కొన్ని ముఖ్యమైన హామీలను ప్రకటించాలని గులాబీ దళపతి కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నందున ముఖ్యమైన హామీలను ఇప్పట్నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకే మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన తర్వాత పాక్షిక మేనిఫెస్టోను అంటే కొన్ని ముఖ్యమైన హామీలను కేసీఆర్‌ ప్రకటిస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.
 

Similar News