వీరి గెలుపుపైనే ఆసక్తి.. ముందంజలో గాలి అనుచరులు!

Update: 2018-05-15 04:27 GMT

ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠతో పాటు బరిలో నిలిచిన మంత్రులు, ప్రముఖుల భవిష్యత్తుపై చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (కాంగ్రెస్‌) చాముండేశ్వరి, బాదామి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (జేడీఎస్‌) చెన్నపట్టణ, రామనగర, లోక్‌సభ సభ్యుడు శ్రీరాములు(భాజపా) మొలకాల్మూరు, బాదామి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గాలపై రాష్ట్రమంతా ఆసక్తి చూపింది. భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప తలపడిన శికారిపురలో ఆయన గెలుపు నల్లేరుపై బండి నడకేననే అంచనాలు ఉన్నాయి..

* మంత్రులు రామలింగారెడ్డి (బీటీఎం లేఅవుట్‌), శివకుమార్‌ (కనకపుర), కృష్ణబైరేగౌడ (బ్యాటరాయనపుర), తన్వీర్‌సేఠ్‌ (నరసింహరాజ), ఆర్‌.వి.దేశ్‌పాండే (హల్యాల), లింగాయతులకు ప్రత్యేక మతం గుర్తింపునకు పోరాడిన ఎం.బి.పాటిల్‌ (బబలేశ్వర్‌), వినయకులకర్ణి (ధారవాడ దక్షిణ), డాక్టర్‌ శరణప్రకాశ్‌ పాటిల్‌ (సేడం)ల గెలుపోటములపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రులు రమేశ్‌కుమార్‌, ప్రియాంక్‌ ఖర్గే, యు.టి.ఖాదర్‌, రమానాథరై, ఈశ్వరఖండ్రే, శాసనసభలో విపక్ష నేతలు జగదీశ్‌ శెట్టర్‌ (హుబ్బళ్లి- ధార్వాడ కేంద్రం), ఈశ్వరప్ప (శివమొగ్గ) నియోజకవర్గాల ఫలితాలపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

* మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సోదరులు సోమశేఖరరెడ్డి (బళ్లారినగర), కరుణాకరరెడ్డి (హరప్పనహళ్లి), ఆయన అనుచరులు సణ్ణ ఫకీరప్ప (బళ్లారి గ్రామీణ), సురేష్‌బాబు (కంప్లి), లల్లేశ్‌రెడ్డి (బీటీఎం లేఅవుట్‌), గవియప్ప (హొసపేటె), చంద్రనాయక్‌ (హూవినహడగలి), నేమిచంద్ర (హగరిబొమ్మనహళ్లి) తదితరులు ఆధిక్యంలో ఉన్నారు.

1983, 2004, 2008లో వరుసగా 65.67, 65.17, 64.68 శాతం పోలింగ్‌ నమోదైనపుడు త్రిశంకు సభలు ఏర్పడ్డాయి. నియోజకవర్గాల సంఖ్యలో తేడా లేదు. 1983లో జనతాపార్టీ భాజపాతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2004లో కాంగ్రెస్‌తో జనతాదళ్‌ చేతులు కలిపింది. 20 నెలల తర్వాత కాంగ్రెస్‌కు చెప్పాపెట్టకుండా జనతాదళ్‌ పక్కకు తప్పుకొని, భాజపాతో కలసి 20 నెలలపాటు ప్రభుత్వాన్ని నడిపింది.

ఒకవేళ త్రిశంకు విధానసభే ఏర్పడితే అధికారాన్ని చేపట్టేందుకు పార్టీలు తగిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్వతంత్రుల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటు కుదరని పక్షంలో అతి తక్కువ బలమున్న రాజకీయ పక్షాన్ని చీల్చేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వెనుకంజ వేయబోవనే అంచనాలు ఉన్నాయి.

Similar News