కేరళకు గుడ్‌న్యూస్‌‌

Update: 2018-08-20 03:23 GMT

జల దిగ్బంధంతో అల్లాడుతోన్న కేరళకు ఐఎండీ ఊరట కలిగించే వార్త చెప్పింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే సహాయక చర్యలు ఊపందుకోగా మరో నాలుగైదు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని భారత వాతావరణశాఖ ప్రకటించింది. అయితే ఇంతటి మహా విషాదంలోనూ వ్యాపారులు విచ్చలవిడిగా నిలువ దోపిడీకి పాల్పడుతున్నారు.

జల విలయంతో అతలాకుతలమైన కేరళకు భారత వాతావరణశాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయన్న ఐఎండీ రాబోయే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలకు ఆస్కారం లేదని ప్రకటించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ను అధికారులు ఎత్తివేశారు. మరోవైపు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలు కూడా ఊపందుకున్నాయి. అయితే కోజీకోడ్‌, కన్నూరు, ఇడుక్కి జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. దాంతో ఈ 3 జిల్లాల్లో ఎల్లో వార్నింగ్‌ కంటిన్యూ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే వందేళ్లలో ఎన్నడూ ఎరుగనంతగా భారీ విపత్తు విరుచుకుపడటంతో కేరళ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి, తాగడానికి మంచినీళ్లు దొరక్క అల్లాడిపోతున్నారు. మరోపక్క నిత్యవసరాల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. పంటలన్నీ వరదలకు తుడిచి పెట్టుకుపోవడంతో కూరగాయల ధరలు విపరీతంగా పెంచేశారు. దాంతో కేజీ పచ్చి మిరప 400 రూపాయలు పలుకుతోంది. ఉల్లి, క్యాకేజీ, ఆలుగడ్డను వంద రూపాయలపైనే అమ్ముతున్నారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకొస్తుండగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో త్రివిధ దళాలు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు.
 

Similar News