టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే ఇంటికి వెళ్లిన ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌

Update: 2018-12-05 06:54 GMT

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. దాంతో అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రచారంతో తెలంగాణను హీటెక్కిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చివరి దశలో ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. మహాకూటమి తరపున నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాసోజు శ్రవణ్‌, టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) ఇంటికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మంగళవారం శ్రవణ్‌ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు...తన నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో పాల్గొన్నారు. పాదయాత్రగా వెళుతూ అభ్యర్థులను ఓట్లు అడిగారు. అదే వీధిలో టీఆర్ఎస్ నేత కేశవరావు ఇల్లు కూడా ఉంది. ఆ విషయం దాసోజు శ్రవణ్‌కు కూడా తెలుసు. ఆ ఇంటిని వదిలేసి వేరే ఇంటికి వెళతారాని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కేశవరావు ఇంట్లోకి కూడా వెళ్లి.. దాసోజు శ్రవణ్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న కేశవరావును కలిసి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేకే స్పందిస్తూ ప్రచారం ఎలా జరుగుతోందో అడిగి తెలుసుకున్నారు. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ పోటీ చేస్తున్నారు.

Similar News