పద్మఅవార్డులు ఇప్పిస్తామంటూ గుంటూరు సీఐ బురిడీ

Update: 2017-12-23 15:46 GMT

మీకు నామినేటెడ్ పదవులు..అవార్డులు... ఏమైనా కావాలా..? అయితే, రండి అమరావతిలో ఓ సార్ ఉన్నారు. ఆయనకు ప్రముఖులతో బాగా పరిచయాలున్నాయి. ఆయన చేసేది పోలీస్ ఉద్యోగమే అయినా.. చేసే వ్యాపారం మాత్రం ఇదే. ఆయన ఇప్పటిదాకా ఎంతమందిని మోసం చేశారో తెలియదు గానీ, ఓ వ్యక్తి వ్యవహారంలో ఘరానా మోసం బయటపడటంతో సార్ తోపాటు మరో నలుగురు జైలుపాలయ్యారు. 
 
ఈ ఘరానా మోసాలకు పాల్పడింది సాధారణ వ్యక్తి కాదు. గుంటూరు సీసీఎస్ సీఐ కాకర్ల శేషారావు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నామినేటెడ్ పదవులు.. అవార్డులు ఇప్పిస్తామని చెప్పి.. కోట్లలో వసూలు చేసినట్లు శేషారావుపై ఆరోపణలున్నాయి. రాజధానిలో తక్కువ ధరకు పొలాలు ఇప్పిస్తామని, కోట్లు వసూలు చేశారని రమణయ్య నాయుడు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మరికొందరి దగ్గర  50 లక్షలు సీఐ వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 
 
కార్పొరేట్‌ పదవులు, పద్మ అవార్డులు ఇప్పిస్తానంటూ మోసం చేసిన సీఐ శేషారావు జైలుపాలయ్యాడు. గూడూరు పోలీసులు సీఐ శేషారావుతోపాటు మరో నలుగురిని అరెస్టు చేశారు. కార్పొరేట్ పదవులు, పద్మ అవార్డుల ఇప్పిస్తానంటూ నెల్లూరు జిల్లా గూడూరు నెహ్రూనగర్‌కు చెందిన రమణయ్య అనే వ్యక్తిని బురిడీ కొట్టించారు. ఆయన నుంచి  4 కోట్లు వసూలుచేసి.. ఆపై ముఖం చాటేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు సీఐతోపాటు ఇతర నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Similar News