ఎమ్మెల్యే సీటుకు కొబ్బరికాయ ఎసరు...కొబ్బరికాయ గొడవతో బొడిగె శోభకు దక్కని సీటు ?

Update: 2018-12-19 04:55 GMT

కొబ్బరి కాయ... శుభానికి సంకేతం. దేవుడికి కొబ్బరికాయ కొట్టి కోరికలు నేరవేర్చుకుంటారు భక్తులు. అంత మహాత్యం గల కొబ్బరికాయ ఒకరి పదవి ఊడగొట్టింది. కొబ్బరికాయ ఏంటి పదవి ఊడగొట్టడమేంటని అనుకుంటున్నారా...? 

ఈమె బొడిగె శోభ. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో బీజేపీ తరుపన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన బోడిగె శోభకు ఈసారి టికెట్ నిరాకరించడంతో బిజెపిలో చేరి పోటి చేసి ఓటమి పాలయింది. అయితే టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ నిరాకరించడానికి ఓ కొబ్బరికాయ కూడా కారణమైంది. 

శోభ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చొప్పదండి మండలంలో ఫైర్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దానికి అప్పటి మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త చొక్కారెడ్డికి వినోద్ కుమార్ కొబ్బరికాయ అందించారు. అక్కడే ఉన్న శోభ అతనికి కొబ్బరికాయ ఎవరిచ్చారంటూ ఘాటుగా స్పందించింది. చొక్కారెడ్డిని దూరం జరగమంటూ అందరి ముందు నెట్టివేసింది. ఈ ఘటనతో ఈటల రాజేందర్, వినోద్ కుమార్ అవక్కాయ్యారు. 

తనకు జరిగిన అవమానంపై చొక్కారెడ్డి, అనుచరులు అప్పుడే.. ఈటల రాజేందర్ కు గోడు వెళ్ల బోసుకున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. శోభకు గత ఎన్నికలలో టికెట్ ఇవ్వకుండా సుంకే రవిశంకర్ కు ఇచ్చారు. సుంకే రవిశంకర్ ఎమ్మెల్యేగా గెలవగా శోభ మూడోస్థానంలో నిలిచింది. చొక్కారెడ్డి చేతిలో ఉన్న కొబ్బరికాయే శోభకు టికెట్ రానివ్వకుండా చేసిందంటూ నియోజకవర్గంలో ఆసక్తికర చర్చ జరిగింది. నోటి దురుసు, నియంత పోకడలు ఆమెను నష్టపరిచాయి. చొక్కా రెడ్డి తనను కొబ్బరికాయ కొట్టకుండా ఆపిన కొబ్బరికాయను జాగ్రత్తగా దాచిపెట్టాడు. సుంకె రవిశంకర్ ఎమ్మెల్యేగా గెలిచాక ఆనాటి కొబ్బరి కాయను కొండగట్టు ఆంజనేయ సన్నిధానంలో కొట్టి మొక్కు తీర్చుకున్నాడు. కొబ్బరికాయ ఓ ఎమ్మెల్యేని మాజీ చేయడంతో పాటు రాజకీయ భవిష్యత్ ను ఛిద్రం చేసిందనే టాక్ వినిపిస్తోంది.  

Similar News