డోర్‌మ్యాట్స్‌పై కంచ ఐలయ్య!

Update: 2017-09-22 11:38 GMT

సామాజికవేత్త, రచయిత కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు’ అనే పుస్తకం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలోని అంశాలు తమను కించపరిచేలా.. దోపిడిదారులుగా చిత్రీకరించేలా ఉన్నాయంటూ ఆర్యవైశ్య సంఘాలు ఇప్పటికే పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. అయితే తాజాగా ఈ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. కంచ ఐలయ్యపై తీవ్ర అసహనంతో ఉన్న ఆర్యవైశ్యులు ఆలయం దగ్గర చెప్పులు విడిచే స్థలంలో కంచ ఐలయ్య ఫొటో ముద్రించిన డోర్‌మ్యాట్స్ వేశారు. వాటిని తొక్కుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పుడీ ఘటన రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. ఈ చర్యపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

ఇన్నాళ్లూ తమను తొక్కేశారని, ఇప్పుడు కూడా ఇలా కాళ్ల కింద వేసుకుని తొక్కుతూ తమ నైజాన్ని బయటపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై దళిత కార్యకర్త పసునూరి రవీందర్ మాట్లాడుతూ ఆ పుస్తకం వైశ్యులు చదువుతారని తాము భావించడం లేదని, ఒకవేళ చదివినా తమకున్న అభ్యంతరాలను విమర్శనాత్మకంగా చెప్పాలని ఆయన సూచించారు. కానీ ఇలా కించపరచడం సరికాదని పసునూరి రవీందర్ అభిప్రాయపడ్డారు. 

Similar News