బడ్జెట్ ఆరంభంలోనే సంచలన ప్రకటన!

Update: 2018-02-01 06:32 GMT

2018 బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రైతుల కోసం సంచలన ప్రకటన చేశారు. అందరూ ఊహించినట్టుగానే ఈ సారి కేంద్ర ప్రభుత్వం రైతులకు వరాల జల్లు కురిపిస్తోంది. ఉత్పత్తి ధరకంటే 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధర చెల్లించనున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మరింత ఊతమిచ్చేందుకు హరిత ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ప్రభుత్వం ఇప్పుడు నిరుపేదల జీవన పరిస్థితులను మెరుగుపర్చడంపై దృష్టిపెట్టినట్టు ప్రకటించారు. కాగా సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి జైట్లీ హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ప్రసంగించడం విశేషం.

జీఎస్‌టీ, నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఎదుగుతున్నదన్నారు. 2014 వరకూ విధాన లోపంతో దేశం నష్టపోయిందని, అవినీతి పేరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక విధానాలను పూర్తిగా మార్చివేశామని చెప్పారు. ఇప్పుడు సహజవనరులను పారదర్శకంగా కేటాయిస్తున్నామన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 

రైతుల సంక్షేమం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేంద్రం కట్టుబడిఉందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. రైతన్నల వ్యవసాయ పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతు ధర నిర్ణయిస్తామని బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు పలు పథకాలను ఆయన ప్రకటించారు. ఆపరేషన్‌ గ్రీన్‌తో పాటు పాడి పరిశ్రమ, మత్స్యపరిశ్రమ కోసం పలు కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ 500 కోట్లు కేటాయించారు. మార్కెట్‌ ధరలు మద్దతు ధరల కంటే తక్కువ ఉంటే ప్రభుత్వమే ఆయా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందన్నారు. 
 

Similar News