ఆ 39 మంది భారతీయులు చనిపోయారు

Update: 2018-03-20 06:58 GMT

ఇరాక్‌లో భారతీయుల కిడ్నాప్‌ ఘటన విషాదాంతమైంది. నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న ఆ 39 మంది భారతీయులు మృతిచెందినట్లు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. 2014లో ఇరాక్‌లో కిడ్నాప్ అయిన 39 మంది భారతీయల ఆచూకీ కోసం భారత్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే వారందరినీ  ఐఎస్ ఉగ్రవాదులు  పొట్టనపెట్టుకున్నారని సుష్మ ప్రకటించారు.
 
మోసుల్‌లో వీరిని సామూహికంగా పూడ్చిపెట్టిన చోటును రాడార్లు కనిపెట్టాయని, మృతదేహాలను బయటకు తీయగా అవి పూర్తిగా కుళ్లిపోయిన దశలో ఉన్నాయని వెల్లడించారు. మృతదేహాలను పరీక్షల కోసం బాగ్దాద్ పంపగా  డీఎన్ఏ శాంపుల్స్ 70 శాతం వరకూ మ్యాచ్ అయ్యాయని సభకు తెలిపారు. ఆ అవశేషాలను తీసుకువచ్చేందుకు జనరల్ వీకే సింగ్ బాగ్దాద్ వెళ్తున్నారని, ప్రత్యేక విమానంలో వాటిని తీసుకువస్తారని సభకు తెలిపారు. ఆ అవశేషాలను తొలుత అమృత్ సర్, తర్వాత పాట్నా, కోల్‌కతాలకు తరిలిస్తామని చెప్పారు. కాగా, ఇరాక్‌లో కిడ్నాప్ అయిన తమవారంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని 2014 నుంచి ఆశగా ఎదురుచూస్తున్న భారతీయ కుటుంబాల్లో సుష్మ ప్రకటన శరాఘాతమైంది. వారి కుటుంబాల్లో ఒక్కసారిగా విషాదం కమ్ముకుంది. ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం కిడ్నాపైన 39 మంది భారతీయ కార్మికులను ఐఎస్ పొట్టనపెట్టుకోవడంపై రాజ్యసభ ఆవేదన వ్యక్తం చేసింది. సభ్యులంతా నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు.


 

Similar News