Gold Prices falling: వరుసగా మూడో రోజు పడిన బంగారం ధరలు... ఈ ధరల తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా?

Update: 2025-05-01 15:45 GMT

Gold Prices in next 3 years: బంగారం ధరలు భారీగా పెరిగి ఈమధ్యే రూ లక్ష మార్క్ తాకిన సంగతి తెలిసిందే. దీంతో చాలామంది బంగారం ధరలు పెరుగుతున్న తీరు చూసి ఆందోళనకు గురయ్యారు. బంగారం ధరలు ఇలాగే ఇంకా పెరుగుతాయా లేక ఇకనైనా తగ్గుతాయా అనే ఆలోచనలో పడ్డారు. సాధారణంగా అక్షయ తృతియ నాడు బంగారం అమ్మకాలు భారీగా ఉంటాయి. అక్షయ తృతియ నాడు బంగారం కొనుగోలుతో కొనేవారికి కలిసొస్తుందో లేదో తెలియదు కానీ అమ్మేవారికి మాత్రం బాగానే కలిసొచ్చేది. కానీ ఈసారి ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం అక్షయ తృతియపై కూడా స్పష్టంగా కనిపించింది.

ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో గత మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గత ఏడాది కాలంలో బంగారం ధరలు 40 శాతం పెరిగాయి. ఒకానొక దశలో ఒక ఔన్స్ బంగారం ధర అత్యధికంగా 3,500 డాలర్ల వరకు వెళ్ళింది. ఆ తర్వాత గత మూడు రోజులుగా 7% మేర తగ్గి, ప్రస్తుతం 3,232 డాలర్లకు దిగొచ్చింది. గత 2 వారాల్లో ఇంత కనిష్టానికి బంగారం ధరలు తగ్గడం ఇదే తొలిసారి. బంగారం ధరలు ఇంకా భారీగా పెరుగుతాయని భయపడుతున్న తరుణంలో ధరలు తగ్గుతున్నాయన్న వార్త కొనుగోలుదారులకు భారీ ఊరటను ఇస్తోంది. ఏప్రిల్ 22న రూ. 1 లక్ష మార్క్ తాకిన బంగారం ధరలు ఇవాళ రూ. 94,710 కు దిగొచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోలుకు ట్రాయ్ ఔన్స్ కొలమానంగా చూస్తారు. ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం 31 గ్రాముల 1 మిల్లీ గ్రాములు ఉంటుంది. అంటే 3 తులాలపై 1 గ్రాము ఎక్కువన్న మాట. ఔన్స్ బంగారం ధర పెరగడం, తగ్గడాన్ని బట్టి ఇండియాలో బంగారం ధరలు మారుతుంటాయి.

డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అనేక ప్రపంచ దేశాలపై టారీఫ్స్ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఎక్కువ సుంకాలు, స్థిరత్వం లేని పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి.

అయితే, ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ, ఈ తగ్గింపు శాశ్వతమేనని ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. రాబోయే మూడేళ్లలో బులియన్ మార్కెట్ ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 5000 డాలర్లకు పెరుగుతుందనేది వారి అంచనా. అదే కానీ జరిగితే ఇప్పుడు ఉన్న డాలర్ వ్యాల్యూ ప్రకారం అప్పటికి తులం బంగారం ధరలు రూ. 1,40,000 దాటుతుంది. ఒకవేళ డాలర్ వ్యాల్యూ ఇప్పుడున్న దానికంటే పెరిగినట్లయితే, బంగారం ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News