Gas Cylinder Booking Rules: వంట గ్యాస్ పై కేంద్రం కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు

Gas Cylinder Booking Rules: LPG సిలిండర్ల బుకింగ్ నియమాల్లో కేంద్రం మార్పులు చేసింది. కొత్త నిబంధనల పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చూడండి.

Update: 2026-03-10 01:40 GMT

Gas Cylinder Booking Rules

Gas Cylinder Booking Rules: ఇప్పటివరకూ ఇంటిలో వాడే వంట గ్యాస్ ఎప్పటికప్పుడు బుక్ చేసుకునే వెసులుబాటు ఉండేది. ఈ మధ్య అంటే ఇరాన్ - ఇజ్రాయేల్ యుద్ధం తారాస్థాయికి చేరిన తరువాత వంట గ్యాస్ బుక్ చేసుకునే కనీస వ్యవధిని 21 రోజులుగా నిర్ణయించారు. అయితే, ఇప్పుడు దానిని కూడా సవరించి తాజాగా కేంద్రం దానిపై కొత్త రూల్ తెచ్చింది.

దేశంలో LPG సిలిండర్ల కృత్రిమ కొరత,బ్లాక్ మార్కెట్‌ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకుంది. గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవడానికి కొత్త గైడ్ లైన్స్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్లను స్టాక్ ఉంచుకోవడాన్ని నివారించడానికి, రెండు బుకింగ్‌ల మధ్య వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పెంచారు.

సాధారణంగా వంట గ్యాస్ సిలెండర్ ఒక కుటుంబానికి 45 నుంచి 55 రోజుల వరకూ వస్తుంది. అందుకే గతంలో 55 రోజులకు ఒకసారి సిలిండర్లు బుక్ చేసుకునే వారు. ఇప్పుడు యుద్ధ భయం కారణంగా కేవలం 15 రోజుల్లోనే వాటిని బుక్ చేసుకుంటున్నారు. దీనిని నియంత్రించడానికి కొత్త నిబంధనను తీసుకువచ్చారు. వాణిజ్య సిలిండర్ల కంటే గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. "గృహ వినియోగదారుల ప్రయోజనాలే మాకు ముఖ్యం" అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దేశంలోని సామాన్య ప్రజలకు వంట గ్యాస్ కొరత రాకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం దేశీయంగా ఉన్న గ్యాస్ శుద్ధి కర్మాగారాలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి పెంచాలని సూచించింది.

మరోవైపు, కేవలం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి కూడా ఎల్‌పీజీని దిగుమతి చేసుకునేందుకు భారత్ చర్చలు జరుపుతోంది. అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా మరియు నార్వే వంటి దేశాలు భారతదేశానికి గ్యాస్ విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఉండవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతానికి పాత సిలిండర్ నిండుకోకపోయినా భయం కొద్దీ బుక్ చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. దేశంలో తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకే ఈ నియమ నిబంధనలు అని వారు వివరిస్తున్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News