UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు: ఒక్క రోజులోనే 70 కోట్ల లావాదేవీలు!
UPI: భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో సంచలన రికార్డు నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థ ఆగస్ట్ 2న చరిత్రలోకి ఎక్కింది. ఒకే రోజులో 70 కోట్ల లావాదేవీలు జరగడం, ఇప్పటివరకు ఎన్నడూ లేని ఘనతగా నిలిచింది.
UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు: ఒక్క రోజులోనే 70 కోట్ల లావాదేవీలు!
UPI: భారతదేశ డిజిటల్ చెల్లింపుల రంగంలో సంచలన రికార్డు నమోదైంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వ్యవస్థ ఆగస్ట్ 2న చరిత్రలోకి ఎక్కింది. ఒకే రోజులో 70 కోట్ల లావాదేవీలు జరగడం, ఇప్పటివరకు ఎన్నడూ లేని ఘనతగా నిలిచింది. ఇది ప్రపంచ స్థాయిలో రియల్ టైమ్ పేమెంట్స్‌లో భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.
జులైలో 25 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు
జూన్‌లో రోజుకి సగటుగా 62.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. కానీ కేవలం కొద్ది వారుల్లోనే ఈ గణాంకం 70 కోట్లకు చేరడం విశేషమని NPCI పేర్కొంది. జులై నెలలో మొత్తం 1947 కోట్ల లావాదేవీలు జరగ్గా, వాటి విలువ రూ. 25.1 లక్షల కోట్లుగా నమోదు అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 35 శాతం, విలువలో 22 శాతం వృద్ధి నమోదైంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది వినియోగదారులు మరియు 6.5 కోట్ల వ్యాపారులు యూపీఐ వాడుతున్నారు. వినియోగంలో ఈ వేగం కొనసాగితే త్వరలోనే రోజుకు 100 కోట్ల లావాదేవీలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు NPCI వెల్లడించింది. సులభమైన ఇంటర్‌ఫేస్, వినియోగదారులకు, వ్యాపారులకు అందుబాటులో ఉండడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలని అధికారులు పేర్కొంటున్నారు.
ఛార్జీల ప్రారంభంతో వినియోగదారుల్లో ఉత్కంఠ
యూపీఐ రికార్డుల మధ్య మరోవైపు ఛార్జీల అంశం కొత్త చర్చకు దారి తీస్తోంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్, ఆగస్ట్ 1 నుంచి పేమెంట్ అగ్రిగేటర్లపై ఫీజులు విధించడం ప్రారంభించింది. ఫోన్‌పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్‌లు ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తించనున్నాయి.
ప్రస్తుతం ఈ ఛార్జీల ప్రభావం సాధారణ వినియోగదారులపై లేకపోయినా, భవిష్యత్తులో ఇది పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల ఆర్థిక సరళిపై ప్రభావం చూపొచ్చని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ఐసీఐసీఐ ఉదాహరణను అనుసరించి ఇతర బ్యాంకులు కూడా అటువంటి దిశగా అడుగులు వేయొచ్చని అంచనా వేస్తున్నారు.