Warren Buffett: వారసుడికి బాధ్యతలు అప్పగించే ముందు.. పోర్ట్‌ఫోలియోను క్లీన్ చేసిన బఫెట్!

Warren Buffett: స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ తన పెట్టుబడి వ్యూహంలో కీలక మార్పులు చేశారు. తన వారసుడు గ్రెగ్ అబెల్‌కు బాధ్యతలు అప్పగించే ముందు, బఫెట్ తన కంపెనీ అయిన 'బెర్క్‌షైర్ హాత్వే' పోర్ట్‌ఫోలియోను భారీగా ప్రక్షాళన చేశారు.

Update: 2026-02-18 13:46 GMT

Warren Buffett: వారసుడికి బాధ్యతలు అప్పగించే ముందు.. పోర్ట్‌ఫోలియోను క్లీన్ చేసిన బఫెట్!

Warren Buffett: స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ తన పెట్టుబడి వ్యూహంలో కీలక మార్పులు చేశారు. తన వారసుడు గ్రెగ్ అబెల్‌కు బాధ్యతలు అప్పగించే ముందు, బఫెట్ తన కంపెనీ అయిన 'బెర్క్‌షైర్ హాత్వే' పోర్ట్‌ఫోలియోను భారీగా ప్రక్షాళన చేశారు. ఈ స్టాక్ మార్కెట్ దిగ్గజం తన కంపెనీలో చేసిన తాజా మార్పుల గురించి ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.

అమెజాన్ అవుట్.. న్యూయార్క్ టైమ్స్ ఇన్..

ఈ త్రైమాసికంలో బఫెట్ తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం అమెజాన్ వాటాలను తగ్గించుకోవడం. అమెజాన్ కంపెనీలో తనకు ఉన్న వాటాలో ఏకంగా 75 శాతాన్ని బఫెట్ విక్రయించారు. ఒకప్పుడు ఈ షేర్లను ముందుగా కొననందుకు తనను తాను 'మూర్ఖుడిని' అని విమర్శించుకున్న బఫెట్, ఇప్పుడు వాటిని వదిలించుకోవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. టెక్ రంగం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే, మీడియా రంగంపై ఆయన మొగ్గు చూపారు. న్యూయార్క్ టైమ్స్ కంపెనీలో సుమారు $351.7 మిలియన్ల విలువైన 51 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. ఈ వార్త బయటకు రావడంతోనే ఆ కంపెనీ షేర్లు 10 శాతం మేర లాభపడ్డాయి.

అలాగే బఫెట్ తన ఫేవరెట్ కంపెనీలైన ఆపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికాలలో కూడా తన పెట్టుబడులను కొంత మేర తగ్గించారు. ఆపిల్‌లో 1.5 శాతం, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 7.1 శాతం మేర వాటాలను విక్రయించారు. టెక్నాలజీ, రిటైల్ రంగాల నుంచి బయటకి వచ్చిన బఫెట్, సంప్రదాయ రంగాలైన ఎనర్జీ (శక్తి), ఇన్సూరెన్స్ (బీమా) వైపు తన పెట్టుబడిని మళ్లించారు. తాజాగా ఈ స్టాక్ మార్కెట్ దిగ్గజం చబ్బ్ అనే బీమా సంస్థలో తన వాటాను 8.7 శాతానికి పెంచుకున్నారు. అలాగే చెవ్రాన్ అనే చమురు దిగ్గజ సంస్థలో 6.5 శాతం వాటాను పెంచుకున్నారు. ఇదే సమయంలో ఆయన పెట్రోకెమికల్ వ్యాపారంలో ఏకంగా $9.7 బిలియన్లతో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్లో కూడా $5.6 బిలియన్ల మేర పెట్టుబడులు పెట్టారు. ఈ మార్పులన్నీ చూస్తుంటే, వారెన్ బఫెట్ తన వారసుడైన గ్రెగ్ అబెల్‌కు కంపెనీని అప్పగించే ముందు పోర్ట్‌ఫోలియోను మరింత సురక్షితంగా, లాభదాయకంగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ కంటే శక్తి, మీడియా, బీమా రంగాలే భవిష్యత్తులో స్థిరమైన లాభాలను ఇస్తాయని ఆయన తీసుకున్న తాజా నిర్ణయాలు సూచిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News