Silver Price Hike: వెండికి 'చైనా' సెగ: 2026 నుంచి ఆకాశానికే వెండి ధరలు? ఎందుకీ ఆందోళన?
Silver Price Hike: 2026 నుంచి వెండి ఎగుమతులపై లైసెన్స్ తప్పనిసరి చేస్తూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్లోబల్ సరఫరా గొలుసులో తీవ్ర ఆందోళనను రేపుతోంది.
Silver Price Hike: ప్రపంచ వెండి మార్కెట్‌ను చైనా తాజా నిర్ణయం కుదిపేస్తోంది. 2026 నుంచి వెండి ఎగుమతులపై లైసెన్స్ తప్పనిసరి చేస్తూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్లోబల్ సరఫరా గొలుసులో తీవ్ర ఆందోళనను రేపుతోంది. ప్రపంచ వెండి సరఫరాలో 60 నుంచి 70 శాతం వాటా చైనాదే కావడంతో, ఈ నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద ప్రభావాన్ని చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
విదేశాలకు వెండి ఎగుమతులకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో సరఫరాలో జాప్యం, కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ప్రభావంగా వెండి ధరలు రాబోయే కాలంలో వేగంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు దెబ్బ
వెండి అనేది కేవలం ఆభరణాలకే పరిమితం కాదని, ఆధునిక సాంకేతిక రంగాల్లో కీలకమైన లోహమని నిపుణులు గుర్తుచేస్తున్నారు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ పరికరాల తయారీలో వెండికి ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అధిక విద్యుత్ వాహకత కారణంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో వెండికి ప్రత్యామ్నాయం లేదని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వెండి సరఫరా తగ్గితే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు కుంటుపడతాయని, ఈవీల తయారీ ఖర్చు పెరిగి వినియోగదారులపై భారం పడుతుందని ఆయన హెచ్చరించారు.
భౌగోళిక రాజకీయాల కోణం
పశ్చిమ దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతల నడుమ, కీలకమైన లోహాల ఎగుమతులను నియంత్రించడం ద్వారా చైనా తన వ్యూహాత్మక బలం ప్రదర్శించాలనుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ సహా అనేక దేశాలు సోలార్ ఎనర్జీ లక్ష్యాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో, వెండి ధరల పెరుగుదల ఆయా ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పెట్టుబడిదారులకు సంకేతం?
పెట్టుబడిదారుల కోణంలో చూస్తే, వెండి ధరలు వచ్చే రెండేళ్లలో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో కమోడిటీ మార్కెట్‌లో వెండిపై ఆసక్తి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీర్ఘకాలంలో ఇతర దేశాలు గనుల తవ్వకాలను పెంచుకోవడం, ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించడం ద్వారా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.