PIB Fact Check: కేంద్రం 500 రూపాయల నోట్లను రద్దు చేస్తుందా? ఇక కనిపించవా? ఇందులో నిజమెంత.?

PIB Fact Check: కేంద్రం 500 రూపాయల నోట్లను రద్దు చేస్తుందా? ఇక కనిపించవా? ఇందులో నిజమెంత.?

Update: 2026-01-20 02:11 GMT

PIB Fact Check: దేశంలో మరోసారి నోట్ల రద్దు జరగబోతోందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం కలిసి ‘డీమోనిటైజేషన్ 2.0’కు సిద్ధమవుతున్నాయా? ముఖ్యంగా రూ.500 నోట్లు పూర్తిగా రద్దు అవుతాయా? అనే ప్రశ్నలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మార్చి తర్వాత ఏటీఎంలలో రూ.500 నోట్లు ఉండవని, క్రమంగా అవి చెలామణి నుంచి తొలగిపోతాయని కొన్ని పోస్టులు పేర్కొనడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దశాబ్దం క్రితం జరిగిన నోట్ల రద్దు అనుభవాలను గుర్తు చేసుకుంటూ చాలామంది ఈ వార్తలపై భయాందోళన వ్యక్తం చేశారు.

ఈ పుకార్లు మరింత ముందుకు వెళ్లి, దేశంలో అతిపెద్ద కరెన్సీ నోటుగా ఇకపై రూ.100 నోటే కొనసాగుతుందంటూ కూడా ప్రచారం జరిగాయి. దీంతో నిజానిజాలపై స్పష్టత అవసరమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం అధికారికంగా స్పందించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వాదనలను PIB ఫ్యాక్ట్ చెక్ పూర్తిగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లను నిషేధించాలన్న ఆలోచనలో లేదని స్పష్టంగా పేర్కొంది. నోట్ల రద్దుకు సంబంధించి ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి ప్రకటనలు లేవని కూడా తెలిపింది. ఈ తరహా సమాచారం పూర్తిగా అసత్యమని, ప్రజలు వాటిని నమ్మవద్దని హెచ్చరించింది.

ఎక్స్ (X) వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, రూ.500 నోట్ల రద్దు గురించి వస్తున్న వార్తలకు ఎటువంటి ఆధారం లేదని PIB వివరించింది. అంతేకాదు, తప్పుదారి పట్టించే సోషల్ మీడియా పోస్టుల స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేసి, అవి నకిలీ సమాచారమని నిర్ధారించింది. ప్రభుత్వ ఆర్థిక విధానాలు లేదా కీలక నిర్ణయాలపై ఖచ్చితమైన సమాచారం కావాలంటే అధికారిక వెబ్‌సైట్లు, ధృవీకరించిన వనరులపై మాత్రమే ఆధారపడాలని ప్రజలకు సూచించింది.

సోషల్ మీడియా వేదికలపై వ్యాపించే తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు గుర్తించి, నిజాలను వెలుగులోకి తీసుకురావడమే PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. కాబట్టి రూ.500 నోట్ల రద్దు లేదా మరోసారి డీమోనిటైజేషన్ జరుగుతుందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం స్పష్టంగా తెలిపినట్లయింది.

Tags:    

Similar News