HDFC Bank: లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గింపు
HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లను 5–10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మార్చి 7 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో లోన్ ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది.
HDFC Bank: లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గింపు
HDFC Bank: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు మరో శుభవార్త అందించింది. బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని టెన్యూర్లపై కనీసం 5 బేసిస్ పాయింట్ల నుంచి గరిష్ఠంగా 10 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించింది.
బ్యాంక్ అధికారిక ప్రకటన ప్రకారం, కొత్త ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు మార్చి 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులతో ఎంసీఎల్ఆర్‌కు అనుసంధానమైన లోన్లపై ఈఎంఐలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు ఈఎంఐ తగ్గించుకోవడం లేదా లోన్ టెన్యూర్‌ను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
వడ్డీ రేట్ల సవరణ తర్వాత ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఎంసీఎల్ఆర్ రేట్లు కనీసం 8.15 శాతం నుంచి గరిష్ఠంగా 8.55 శాతం మధ్య ఉన్నాయి. అంతకుముందు ఇవి 8.25 శాతం నుంచి 8.60 శాతం వరకు ఉండేవి. ఓవర్‌నైట్ మరియు ఒక నెల టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌పై 10 బేసిస్ పాయింట్ల కోత విధించి 8.25 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గించారు.
మూడు నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌ను 8.30 శాతం నుంచి 8.25 శాతానికి తగ్గించారు. ఆరు నెలలు మరియు ఒక సంవత్సరం టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.40 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గింది. ఎక్కువగా వినియోగదారుల లోన్లు ఒక సంవత్సరం టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానంగా ఉంటాయి.
ఇక రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.50 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గించగా, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గింది.
ఇదే సమయంలో బ్యాంక్ ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను కూడా పెంచింది. 3 సంవత్సరాలు 1 రోజు నుంచి 4 సంవత్సరాలు 7 నెలల వరకు ఉన్న టెన్యూర్లపై సాధారణ కస్టమర్లకు వడ్డీ రేటును 6.40 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజెన్లకు ఈ రేటును 6.90 శాతం నుంచి 7 శాతానికి పెంచింది.
ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు లోన్లపై వసూలు చేసే కనీస వడ్డీ రేటుగా చెప్పొచ్చు. ఈ రేటుకంటే తక్కువ వడ్డీకి లోన్ ఇవ్వలేరు. అన్ని బ్యాంకుల్లో ఒకే విధానం ఉండేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2016లో ఈ ఎంసీఎల్ఆర్ విధానాన్ని ప్రవేశపెట్టింది.