Jio IPO: ఇన్వెస్టర్లకు శుభవార్త.. జియో ఐపీఓ జీఎంపీ హాట్‌టాపిక్‌.. ధర, సైజ్, వాల్యుయేషన్ అంచనాలివే!

Reliance Jio IPO Buzz: రిలయన్స్ జియో ఐపీఓపై ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొంది. జియో ఐపీఓ జీఎంపీ, అంచనా షేర్ ధర, ఇష్యూ సైజ్, వాల్యుయేషన్ వివరాలు తెలుసుకోండి.

Update: 2026-01-10 09:00 GMT

Jio IPO: ఇన్వెస్టర్లకు శుభవార్త.. జియో ఐపీఓ జీఎంపీ హాట్‌టాపిక్‌.. ధర, సైజ్, వాల్యుయేషన్ అంచనాలివే!

Reliance Jio IPO Buzz: రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి మరో చరిత్రాత్మక ఐపీఓ రానుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దీనికి సంబంధించిన కీలక వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం జియో ఐపీఓ భారత్‌లోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ‌గా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మర్చంట్ బ్యాంకర్ల అంచనాల ప్రకారం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ విలువ సుమారు రూ. 16 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ప్రకారం కంపెనీ వాల్యుయేషన్ దాదాపు 180 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఐపీఓ ద్వారా రూ. 36 వేల కోట్ల నుంచి రూ. 40 వేల కోట్ల వరకు నిధులు సమీకరించవచ్చని సమాచారం. ఇది జరిగితే ఇప్పటివరకు నమోదైన అన్ని ఐపీఓ రికార్డులను జియో అధిగమించనుంది.

సాధారణంగా ఐపీఓలో కనీసం 5 శాతం వాటా విక్రయించాల్సి ఉంటుంది. అయితే జియో భారీ పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వాటాను 2.5 శాతానికి పరిమితం చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ, సెబీ నుంచి ప్రత్యేక అనుమతులు అవసరం. ఒకవేళ 2.5 శాతం వాటాతోనే ఐపీఓ వస్తే, కంపెనీ సుమారు 4 నుంచి 4.5 బిలియన్ డాలర్లు (రూ. 36,000–40,500 కోట్లు) సమీకరించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక జియో ఐపీఓ టైమ్‌లైన్ విషయానికి వస్తే.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలోనే ఐపీఓ మార్కెట్లోకి వస్తుందని గతంలోనే ముకేశ్ అంబానీ ప్రకటించారు. అంటే 2026 జూన్ లోపే జియో ఐపీఓ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

ధరల శ్రేణి విషయానికొస్తే, ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం కంపెనీ వాల్యుయేషన్ 130 నుంచి 170 బిలియన్ డాలర్ల మధ్య ఉంటే, రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్ ధర రూ. 1,048 నుంచి రూ. 1,457 మధ్య ఉండొచ్చని బొనాంజా రీసెర్చ్ అనలిస్ట్ అభినవ్ తివారీ అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా, గ్రే మార్కెట్లో కూడా జియో ఐపీఓ హడావుడి మొదలైంది. ఆల్గో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ బిగుల్ (Bigul) సమాచారం ప్రకారం ప్రస్తుతం జియో షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 93గా ఉన్నట్లు తెలుస్తోంది. సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హేరింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) సమర్పించిన తర్వాత ఈ జీఎంపీ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ద్వారా రూ. 28 వేల కోట్లు సమీకరించి అతిపెద్ద ఐపీఓగా నిలిచింది. ఆ తర్వాత ఎల్ఐసీ, పేటీఎం ఉన్నాయి. ఇప్పుడు రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఈ అన్ని రికార్డులను చెరిపేసే స్థాయిలో ఉండబోతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News