Market Bloodbath: స్టాక్ మార్కెట్‌లో యుద్ధం ఎఫెక్ట్.. ఒక్క రోజే రూ.5 లక్షల కోట్ల సంపద మటాష్!
Market Bloodbath: స్టాక్ మార్కెట్‌లో యుద్ధం ఎఫెక్ట్.. సెన్సెక్స్ 1300 పాయింట్లు పతనం.. ఒక్క రోజే రూ. 5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి. మార్కెట్ ఇంత భారీగా పడిపోవడానికి గల ప్రధాన కారణాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
Market Bloodbath: స్టాక్ మార్కెట్‌లో యుద్ధం ఎఫెక్ట్.. ఒక్క రోజే రూ.5 లక్షల కోట్ల సంపద మటాష్!
Market Bloodbath: మంగళవారం కాస్త కోలుకున్నట్లు కనిపించిన స్టాక్ మార్కెట్లు, బుధవారం నాటికి మళ్లీ కుప్పకూలాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,342.27 పాయింట్లు (1.72%) పడిపోయి 76,863.71 వద్ద ముగియగా, నిఫ్టీ 394.75 పాయింట్లు (1.63%) పతనమై 23,866.85 వద్ద స్థిరపడింది. నిన్నటి వరకు రూ.447 లక్షల కోట్లుగా ఉన్న బిఎస్‌ఇ మార్కెట్ క్యాపిటలైజేషన్, నేడు ఒకే రోజులో రూ.5 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ.441.90 లక్షల కోట్లకు పడిపోయింది.
భారీ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
1. భౌగోళిక రాజకీయ అనిశ్చితి:
అమెరికా & ఇజ్రాయెల్ - ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయనే వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందన్న భయం మార్కెట్లను ఒత్తిడికి గురిచేసిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
2. బ్యాంకింగ్ రంగం కుదేలు:
ముఖ్యంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ స్టాక్‌లు 1.4% కంటే ఎక్కువ నష్టపోయాయి. బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, ఆటో రంగాలు కూడా భారీగా పడిపోయాయి. టాప్ 30 స్టాక్స్‌లో 28 కంపెనీలు నష్టాల్లోనే ముగియడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
3. పెరుగుతున్న ఇండియా VIX (అస్థిరత):
మార్కెట్ అస్థిరతను సూచించే India VIX 8% పైగా పెరిగి 20.5కి చేరుకుంది. ఇది సమీప భవిష్యత్తులో మార్కెట్ మరింత అస్థిరంగా ఉంటుందనే సంకేతాన్ని ఇస్తోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
4. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు (FII Outflow):
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మార్చి 10న కూడా దాదాపు రూ.4,673 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు కొంతవరకు కొనుగోళ్లు చేసినా, అది గ్లోబల్ రిస్క్ కారణంగా మార్కెట్ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది.
మరోవైపు, వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ముడి చమురు ధరలను నియంత్రించడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ రికార్డు స్థాయిలో చమురు నిల్వలను విడుదల చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి, ఇది ప్రపంచ మార్కెట్లకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. ప్రస్తుతానికి స్మాల్-క్యాప్ స్టాక్స్ 0.5% పెరిగినప్పటికీ, మెయిన్ ఇండెక్స్‌లు మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. యుద్ధ మేఘాలు తొలగిపోయే వరకు మార్కెట్లలో ఇలాంటి అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.