Adani Total Gas: మార్కెట్లలో ముంచెత్తిన నష్టాలు.. అదానీ గ్యాస్ మాత్రం 18 శాతం జంప్! అసలు కారణం ఇదే..
Adani Total Gas: ఈ రోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలినా అదానీ గ్యాస్ షేర్లు మాత్రం 18 శాతం లాభపడ్డాయి. ఇరాన్ యుద్ధం, ఖతార్ ఎల్‌ఎన్‌జి సరఫరా నిలిపివేత అదానీ టోటల్ గ్యాస్ షేర్లను ఎలా ప్రభావితం చేశాయో ఈ స్టోరీలో తెలుసుకోండి.
Adani Total Gas: మార్కెట్లలో ముంచెత్తిన నష్టాలు.. అదానీ గ్యాస్ మాత్రం 18 శాతం జంప్! అసలు కారణం ఇదే..
Adani Total Gas: స్టాక్ మార్కెట్ చరిత్రలో మార్చి 11వ తేదీ ఇన్వెస్టర్లకు ఒక పీడకలగా మారింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లు పతనమై 77,061 వద్దకు చేరగా, నిఫ్టీ 333 పాయింట్లు కోల్పోయి 23,928 వద్ద ట్రేడవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ అదానీ టోటల్ గ్యాస్ షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
అదానీ గ్యాస్ షేర్ల ప్రభంజనం..
మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు బుధవారం ఏకంగా 18 శాతం వరకు పెరిగాయి. NSEలో రూ.479 వద్ద మొదలైన షేరు ధర, అనూహ్యంగా రూ.560.30కి చేరుకుంది. మధ్యాహ్నం 1:20 గంటల సమయానికి 17.52% లాభంతో రూ.555.20 వద్ద ట్రేడ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు గ్యాస్ కంపెనీలకు లాభదాయకంగా మారాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే షిప్పింగ్‌పై దాడుల ప్రభావం పడటంతో గ్యాస్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇరాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జి ఎగుమతి కేంద్రమైన ఖతార్ తన ఉత్పత్తిని నిలిపివేసింది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో 50% ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. సరఫరా తగ్గడంతో దేశీయంగా గ్యాస్ షేర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
ప్రభుత్వ కీలక నిర్ణయం..
దేశీయంగా గ్యాస్ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద అత్యవసర అధికారాలను ఉపయోగించింది. దీని ప్రకారం ఇళ్లలోకి వచ్చే పైప్డ్ గ్యాస్ (PNG), వాహనాల కోసం వాడే CNG, LPG ఉత్పత్తికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. గత ఆరు నెలల సగటు వినియోగంలో 100 శాతం సరఫరాను నిర్ధారించాలని ప్రభుత్వం కంపెనీలకు స్పష్టం చేసింది. యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ, గ్యాస్ రంగంలోని కంపెనీలకు ఈ పరిస్థితులు కలిసివస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అదానీ టోటల్ గ్యాస్ వంటి సంస్థలు ప్రభుత్వ ప్రాధాన్యత రంగాల్లో ఉండటం వల్ల ఇన్వెస్టర్లు వీటిపై మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.