Egg Prices : గుడ్డుకు గడ్డురోజులు.. గల్ఫ్ ఎగుమతులు బంద్.. భారీగా పడిపోయిన ధరలు
Egg Prices : పశ్చిమాసియా యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనితో హైదరాబాద్‌లో గుడ్డు ధరలు రూ.3.50కి పడిపోయాయి, పౌల్ట్రీ రైతులు భారీ నష్టాల్లో ఉన్నారు.
Egg Prices
Egg Prices : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య చెలరేగిన యుద్ధ జ్వాలలు ఇప్పుడు మన దేశంలోని సామాన్యుడి గుడ్డు మీద పడ్డాయి. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని సెగ మాత్రం దేశంలోని పౌల్ట్రీ రంగానికి గట్టిగా తగిలింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కోడిగుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గుడ్డు ధరలు సగానికి పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారు.
నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (NECC) గణాంకాల ప్రకారం, గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ గుడ్డు ధరలు కుప్పకూలాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఒక్కో గుడ్డు ధర రూ.7.06 ఉండగా, ఇప్పుడు అది రూ.4.60కి, కొన్ని చోట్ల అంతకంటే తక్కువకే పడిపోయింది. కర్ణాటకలోని హోస్పేట్, మైసూరు వంటి ప్రాంతాల నుంచి గుడ్లను తమిళనాడులోని నామక్కల్‌కు పంపి అక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే యుద్ధం మొదలైన రోజు నామక్కల్ వెళ్తున్న 4.7 లక్షల గుడ్ల కంటైనర్ మధ్యలోనే ఆగిపోయి వెనక్కి రావాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక్కడ రోజుకు సుమారు 3.50 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇక్కడి నుంచి గుడ్లు పశ్చిమ ఆసియా, ఆఫ్రికాలోని సుమారు 40 దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఎగుమతులు ఆగడం, స్థానికంగా వినియోగం తగ్గడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. ఒక్కో గుడ్డుపై రైతుకు రూ.1.50 వరకు నష్టం వస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వందలాది పౌల్ట్రీ ఫారాల్లో గుడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. వీటిని కోల్డ్ స్టోరేజీల్లో దాచడానికి కూడా అదనపు ఖర్చు అవుతోంది.
ధరలు తగ్గడానికి యుద్ధం ఒక్కటే కారణం కాదు, ప్రస్తుతం నడుస్తున్న రంజాన్ మాసం, పెరుగుతున్న ఎండలు కూడా ఒక కారణమే. సాధారణంగా ఎండాకాలంలో గుడ్ల వినియోగం తగ్గుతుంది. దీనికి తోడు రంజాన్ ఉపవాసాల వల్ల ముస్లిం సోదరులు పగటిపూట ఆహారం తీసుకోకపోవడం వల్ల డిమాండ్ తగ్గింది. ఈ రెండు కారణాలకు తోడు యుద్ధం తోడవ్వడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది. అటు హైదరాబాద్ హోల్ సేల్ మార్కెట్‌లో నేడు గుడ్డు ధర రూ.3.50 నుంచి రూ.3.80 మధ్యలో ట్రేడవుతోంది. రిటైల్ మార్కెట్‌లో మాత్రం రూ.5 వరకు అమ్ముతున్నారు.
ముందు ముందు యుద్ధం గనుక ముదిరితే ఎగుమతులు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఎగుమతులు కాక గుడ్లన్నీ స్థానిక మార్కెట్లోకి వస్తే ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పౌల్ట్రీ యజమానులు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. మేత ఖర్చులు పెరగడం, గుడ్డు ధరలు తగ్గడంతో గిట్టుబాటు కాక ఫారాలను నిర్వహించడం భారంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.