Property Tax: ఆస్తిపన్ను పెరుగుతుందా, తగ్గుతుందా? కొత్త లెక్కలు ఏంటి?
Property Tax in Hyderabad 2025: శివారు మున్సిపాలిటీలు–జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను తేడాలు, కొత్త విలీనం తర్వాత పన్ను పెరుగుతుందా తగ్గుతుందా? లెక్కలు, ఉదాహరణలు, పూర్తి వివరాలు.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు మరియు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం రెండు విధాలుగా ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. శివారు ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విలీనం అవుతున్న నేపథ్యంలో, ఇకపై ఒకే విధానం వస్తుందా? పన్ను పెరుగుతుందా? తగ్గుతుందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం ఎలా వసూలు చేస్తున్నారు?
శివారు ప్రాంతాలు మరియు జీహెచ్‌ఎంసీ పరిధిలో పన్ను విధానం పూర్తిగా వేర్వేరు. ఒక ఉదాహరణతో చూద్దాం.
బండ్లగూడ జాగీర్ (పాత మున్సిపాలిటీ) — ఆస్తిపన్ను లెక్కలు
150 చ.గజాల స్థలంలో 1100 చ.అడుగుల విస్తీర్ణంతో ఒక అంతస్తు ఇంటి నిర్మాణం ఉందని భావిస్తే:
నిర్మాణ వ్యయం:
- సర్కారు నిర్దేశిత రేట్: రూ.1100 / చ.అ
- 1100 చ.అ × 1100 = రూ.12,10,110
భూ విలువ (Land Value):
- గజం రిజిస్ట్రేషన్ విలువ: రూ.10,500
- 150 గజాలు × 10,500 = రూ.15,75,000
మొత్తం విలువ:
- నిర్మాణం + భూ విలువ = రూ.27,85,110
ఆస్తిపన్ను (0.15%):
- 27,85,110 లో 0.15% = రూ.4,177.66
- అదనంగా 8% గ్రంథాలయ పన్ను కూడా వర్తిస్తుంది
- ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది
- నిర్మాణ అనుమతి లేకుంటే పన్ను రెట్టింపు
రాజేంద్రనగర్ (GHMC) — ఆస్తిపన్ను లెక్కలు
ఇక్కడ భవనం విస్తీర్ణమే ప్రధాన ఆధారం.
పన్ను లెక్క విధానం:
- భవనం విస్తీర్ణం: 1100 చ.అ
- యూనిట్ ధర: రూ.1
- GHMC కార్పొరేషన్ విలువ: రూ.3.89
- 1100 × 1 × 3.89 = రూ.4,279 (ఇందులోనే గ్రంథాలయ పన్ను కూడా కలుపుతారు)
వాణిజ్య భవనాల కోసం:
యూనిట్ విలువ ప్రాంతానికనుగుణంగా మారుతుంది.
అనుమతి లేని భవనాల కోసం:
పన్ను రెట్టింపు, అయితే ఇక్కడ ఏటా 5% పెరుగుదల ఉండదు.
విలీనం తర్వాత ఏమవుతుంది? పన్ను పెరుగుతుందా?
కొత్తగా నగరానికి ఒకే విధానం తీసుకువస్తే:
- GHMC రూల్స్ వర్తిస్తే — కొందరికీ పన్ను తగ్గే అవకాశం
- పాత మున్సిపాలిటీ రూల్స్ వర్తిస్తే — GHMC ప్రాంతాలలో పన్ను పెరిగే అవకాశం
ప్రభుత్వం ఏ విధానం తీసుకుంటుందనేదానిపై తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది.