Ola: ఒక్క ఏడాదిలోనే తలకిందులు..దుకాణం క్లోజ్ చేస్తున్న ఓలా !

Ola: ఒకప్పుడు భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఎదురులేని రారాజుగా వెలిగిన ఓలా ఎలక్ట్రిక్ నేడు పెను సంక్షోభంలో కూరుకుపోయింది.

Update: 2026-02-22 04:39 GMT

Ola: ఒక్క ఏడాదిలోనే తలకిందులు..దుకాణం క్లోజ్ చేస్తున్న ఓలా !

Ola: ఒకప్పుడు భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ఎదురులేని రారాజుగా వెలిగిన ఓలా ఎలక్ట్రిక్ నేడు పెను సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాది కిందట 26 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచిన ఈ కంపెనీ, నేడు కేవలం 6.3 శాతానికి పడిపోవడం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. స్పీడ్ పెంచిన ప్రత్యర్థులు, వెక్కిరిస్తున్న నష్టాలు, మూతపడుతున్న షోరూమ్‌లు.. వెరసి ఓలా సామ్రాజ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

గతేడాది దేశవ్యాప్తంగా 4,000 రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ఓలా, ఇప్పుడు వాటన్నింటినీ మూసివేసే పనిలో పడింది. 2026 మార్చి నాటికి తన ఫిజికల్ స్టోర్ల సంఖ్యను కేవలం 550కి పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే నెట్‌వర్క్‌ను 700కి తగ్గించిన కంపెనీ, ఆదాయం క్షీణించడంతో నిర్వహణ భారమై ఉద్యోగులకు సైతం ఉద్వాసన పలుకుతోంది.

నికర నష్టం రూ. 487 కోట్లు. గతేడాది లాభాల్లో ఉండటం గమనార్హం.ఆదాయం ఏకంగా 55 శాతం పతనమై రూ. 470 కోట్లకు చేరింది.విక్రయాలు గతంతో పోలిస్తే డెలివరీలు 61 శాతం తగ్గాయి.టీవీఎస్, బజాజ్, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజాల ధాటికి ఓలా తన పట్టు కోల్పోయింది.

కేవలం పోటీ మాత్రమే కాదు, సర్వీస్ సమస్యలు మరియు క్వాలిటీ పరంగా వచ్చిన విమర్శలు ఓలా బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశాయి. ఫిబ్రవరి 2026లో (18వ తేదీ వరకు) కేవలం 2,575 వాహనాలు మాత్రమే విక్రయించగలిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.స్వల్పకాలిక లక్ష్యాల కంటే దీర్ఘకాలిక మనుగడపై దృష్టి పెట్టామని కంపెనీ చెబుతున్నప్పటికీ, ఈ పతనం నుంచి ఓలా మళ్లీ పుంజుకుంటుందా? లేక దిగ్గజాల పోటీలో వెనుకబడిపోతుందా? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News