Business success: ఫీజు లేదు.. కాలేజ్ లేదు.. యూట్యూబ్ స్కిల్స్‌తో రూ.11 కోట్లు సంపాదించిన యువకుడు..!!

Business success: ఫీజు లేదు.. కాలేజ్ లేదు.. యూట్యూబ్ స్కిల్స్‌తో రూ.11 కోట్లు సంపాదించిన యువకుడు..!!

Update: 2026-01-11 05:44 GMT

Business success: ఓటమి దగ్గరికి వెళ్లిన ప్రతి క్షణం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే విజయం తప్పక దక్కుతుందని తన జీవితంతోనే చూపించాడు కెనడాకు చెందిన యువ ఎంటర్‌ప్రెన్యూర్ తువాన్ లే. చేతిలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా, ఎలాంటి ఫార్మల్ బిజినెస్ విద్య లేకుండానే యూట్యూబ్‌ను గురువుగా చేసుకుని వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాడు. అదే నైపుణ్యాన్ని ఆయుధంగా మార్చుకుని నేడు సుమారు రూ. 11 కోట్లకు పైగా (దాదాపు 1.4 మిలియన్ డాలర్లు) వార్షిక టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగాడు.

ప్రారంభ దశలో తువాన్ లే చేసిన పని ఎంతో సాధారణం. స్థానిక చిన్న వ్యాపారాలను సంప్రదిస్తూ, తక్కువ ధరలో వీడియో ఎడిటింగ్ సేవలు అందించాడు. పెద్ద బ్రాండ్లు కాదు, పేరు లేదు, అనుభవం లేదు. అయినా సరే ప్రతి ప్రాజెక్ట్‌ను నాణ్యతతో పూర్తి చేస్తూ తన పనితోనే నమ్మకం సంపాదించాడు. ఒక్కో చిన్న పనితో పోర్ట్‌ఫోలియోను బలపరుచుకుంటూ ముందుకు సాగాడు. ఇదే అతని ప్రయాణానికి పునాది అయింది.

ఆర్థికంగా చూస్తే మొదటి ఏడాది అతనికి పెద్దగా ఆశాజనకంగా లేదు. మొత్తం ఆదాయం కేవలం 8,500 డాలర్లే. అయినా నిరాశ పడకుండా అదే దారిలో కొనసాగాడు. రెండో ఏడాదికి ఆదాయం 17,400 డాలర్లకు పెరిగింది. ఇక మూడో ఏడాది రాగానే కరోనా మహమ్మారి అతని వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్‌డౌన్ కారణంగా ఉన్న క్లయింట్లందరూ ఒక్కసారిగా దూరమయ్యారు. దీంతో ఆదాయం మళ్లీ తగ్గి 12,350 డాలర్ల వద్ద ఆగిపోయింది.

అయితే, అదే సమయంలో తువాన్ లే ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చిన కొద్దిపాటి ఆదాయాన్ని వ్యక్తిగత ఖర్చులకు కాకుండా పూర్తిగా వ్యాపారానికే వెచ్చించాడు. రోజూ వేల సంఖ్యలో వ్యాపార సంస్థలకు ‘కోల్డ్ ఈమెయిల్స్’ పంపుతూ తన సేవలను పరిచయం చేశాడు. నిరంతర ప్రయత్నాలు, ఓపిక, పట్టుదల కలిసి చివరకు ఫలితం ఇచ్చాయి. అదే ఏడాది చివరి నాటికి అతని ఆదాయం ఏకంగా 1,10,000 డాలర్లకు దూసుకెళ్లింది.

వ్యాపారం ఊపందుకోవడంతో నాలుగో ఏడాదిలో తన మొదటి ఉద్యోగిని నియమించుకున్నాడు. పనిభారం పెరిగినా నాణ్యత తగ్గకుండా చూసుకుంటూ ఆ ఏడాది సుమారు 3,50,000 డాలర్ల టర్నోవర్ సాధించాడు. ఐదో ఏడాది వచ్చేసరికి అతని సంస్థ 15 మంది సభ్యులతో కూడిన బృందంగా మారింది. అంతర్జాతీయంగా పేరున్న బ్రాండ్‌లు కూడా అతని క్లయింట్ల జాబితాలో చేరాయి.

తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ “వ్యాపారం చేయడం నా జీవితంలో చేసిన అత్యంత కఠినమైన పని. అదే సమయంలో అత్యంత సంతృప్తినిచ్చిన అనుభవం కూడా ఇదే” అని తువాన్ లే చెబుతాడు. ఒకే రంగంలో సంవత్సరాల పాటు అంకితభావంతో పనిచేస్తే, మొదట చిన్నగా కనిపించిన నైపుణ్యమే కోట్ల విలువైన విజయంగా మారుతుందని అతని కథ స్పష్టంగా నిరూపిస్తోంది.

Tags:    

Similar News