Budget 2026 : బంగారం ధరలు భారీగా తగ్గుతాయా? పసిడి ప్రియుల ఆశలన్నీ నిర్మలమ్మపైనే

బంగారం ధరలు భారీగా తగ్గుతాయా? పసిడి ప్రియుల ఆశలన్నీ నిర్మలమ్మపైనే

Update: 2026-01-26 06:30 GMT

 Budget 2026 : భారతదేశంలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు. అది ఒక సెంటిమెంట్, ఆపదలో ఆదుకునే ఆస్తి. అయితే ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.6 లక్షల మార్కును తాకడంతో సామాన్యుడికి బంగారు కల భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అందరి కళ్లు బడ్జెట్ 2026 పైనే ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పసిడి ప్రియులకు ఏమైనా ఊరటనిస్తారా? ధరలు తగ్గే అవకాశం ఉందా? అనే ఆసక్తికర అంశాలపై ఈ ప్రత్యేక కథనం.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర 5,000 డాలర్లకు, వెండి 100 డాలర్లకు చేరువలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు గ్రీన్‌లాండ్ అంశంపై తలెత్తిన అంతర్జాతీయ వివాదాలు, సరఫరా గొలుసులో అంతరాయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రూపాయి బలహీనపడటం కూడా దేశీయంగా ధరలు పెరగడానికి కారణమైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తేనే ధరలు తగ్గుతాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

జువెలరీ ఇండస్ట్రీ వర్గాలు ముఖ్యంగా మూడు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. మొదటిది, దిగుమతి సుంకం తగ్గింపు. ప్రస్తుతం ఉన్న పన్నుల భారం వల్ల విదేశీ బంగారం ధర కన్నా దేశీయ ధర అధికంగా ఉంటోంది. దీనివల్ల రిటైల్ వ్యాపారం కుంటుపడుతోంది. పన్ను తగ్గిస్తే వినియోగం పెరుగుతుందని, తద్వారా తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని శృంగార్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. రెండోది, జీఎస్‌టీ తగ్గింపు. ప్రస్తుతం ఆభరణాలపై 3 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. దీనిని 1.25 శాతానికి లేదా 1.5 శాతానికి తగ్గించాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ కోరుతోంది.

ఇక పెట్టుబడిదారుల విషయానికి వస్తే.. సావరీన్ గోల్డ్ బాండ్ పథకంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2024లో నిలిపివేసిన ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎస్‌జీబీ ద్వారా ప్రభుత్వానికి నిధులు సమకూరడమే కాకుండా, ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లపై భారం తగ్గుతుంది. అలాగే డిజిటల్ గోల్డ్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి పన్ను మినహాయింపులు ఇస్తే, గృహాల్లో మూలుగుతున్న బంగారం ఆర్థిక వ్యవస్థలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 1న వెలువడే బడ్జెట్ తీర్పు సామాన్యుడికి తీపి కబురు అందిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News