Renault Duster : అప్పట్లో ఇన్నోవా, స్కార్పియోలకే టఫ్ ఫైట్ ఇచ్చింది..అంత క్రేజ్ ఉన్నా ఎందుకు ఆగిపోయింది?

అప్పట్లో ఇన్నోవా, స్కార్పియోలకే టఫ్ ఫైట్ ఇచ్చింది..అంత క్రేజ్ ఉన్నా ఎందుకు ఆగిపోయింది?

Update: 2026-01-31 04:30 GMT

Renault Duster : భారతీయ రోడ్లపై ఒకప్పుడు రారాజులా వెలిగిన రెనాల్ట్ డస్టర్ మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఎస్‌యూవీ అంటే కేవలం పెద్ద కార్లే కాదు, మిడిల్ క్లాస్ వాళ్లకు కూడా అందుబాటులో ఉంటాయని నిరూపించిన ఈ కారు, సుమారు మూడేళ్ల విరామం తర్వాత సరికొత్త హంగులతో మార్కెట్లోకి వస్తోంది. కేవలం రూ.21,000 చెల్లించి ఇప్పుడే ఈ కారును బుక్ చేసుకోవచ్చు. మార్చి నెలలో ధరల ప్రకటన, డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ అనే సెగ్మెంట్‌కు ప్రాణం పోసింది రెనాల్ట్ డస్టర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2012 జూలైలో తొలిసారిగా లాంచ్ అయినప్పుడు, భారతీయులకు ఈ తరహా కారు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. అప్పట్లో ఇన్నోవా, స్కార్పియో, బొలెరో వంటి దిగ్గజ కార్ల మధ్య డస్టర్ తనదైన ముద్ర వేసింది. లాంచ్ అయిన మొదటి పది నెలల్లోనే దాదాపు 40 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2014 నాటికి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఐదవ ఎస్‌యూవీగా నిలిచి, అప్పట్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ క్రెటా వంటి కార్లు మార్కెట్లోకి రాకముందే డస్టర్ తన సామ్రాజ్యాన్ని స్థాపించుకుంది.

అయితే, ఇంతటి ఘనచరిత్ర ఉన్న డస్టర్ 2022లో ఎందుకు ఆగిపోయింది? దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. కాలక్రమేణా మార్కెట్లోకి వచ్చిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లు అత్యాధునిక ఫీచర్లు, విలాసవంతమైన ఇంటీరియర్లతో కస్టమర్లను ఆకట్టుకున్నాయి. కానీ డస్టర్ మాత్రం తన పాత డిజైన్‌ను, ఫీచర్లను మార్చడంలో వెనుకబడింది. దీనికి తోడు 2017లో గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో డస్టర్ బేస్ వేరియంట్‌కు సున్నా సేఫ్టీ రేటింగ్ రావడం కంపెనీకి పెద్ద మైనస్ అయ్యింది. ఆ తర్వాత ఎయిర్‌బ్యాగ్స్ జోడించి 3 స్టార్ రేటింగ్ పొందినప్పటికీ, అప్పటికే కస్టమర్లలో నమ్మకం కొంత సన్నగిల్లింది.

మరో ప్రధాన కారణం పోటీ. రెనాల్ట్ డస్టర్ మార్కెట్లోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వచ్చిన క్రెటా, అతి తక్కువ కాలంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. డస్టర్ విక్రయాలు ఏడాదికేడాది పడిపోతూ వచ్చాయి. పదేళ్ల కాలంలో సుమారు 2 లక్షల కార్లను విక్రయించిన ఈ మోడల్‌ను, సరికొత్త అప్‌డేట్స్ ఇవ్వలేక చివరకు 2022 ప్రారంభంలో రెనాల్ట్ నిలిపివేసింది. కానీ ఇప్పుడు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్త అవతారంలో డస్టర్ వస్తోంది. ఈసారి కారు లుక్స్ మాత్రమే కాదు, టెక్నాలజీ, సేఫ్టీ విషయంలో కూడా రాజీ పడకుండా మార్కెట్లోకి రావాలని రెనాల్ట్ భావిస్తోంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ ఉంది. క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా వంటి దిగ్గజాలను ఢీకొట్టడం డస్టర్ కు అంత సులభం కాదు. అయితే, పాత డస్టర్ కు ఉన్న రగ్డ్ లుక్, డ్రైవింగ్ కంఫర్ట్ ను ఇష్టపడే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. సరికొత్త డస్టర్ అత్యాధునిక ఫీచర్లు, టర్బో ఇంజిన్ ఆప్షన్లతో రాబోతోంది. మార్చిలో ధరలు వెల్లడైన తర్వాత, ఈ పాత పులి మళ్ళీ తన అడ్డాను ఎలా కాపాడుకుంటుందో చూడాలి. కేవలం రూ.21 వేలకే బుకింగ్స్ అందుబాటులో ఉండటం కస్టమర్లలో ఆసక్తిని కలిగిస్తోంది.

Tags:    

Similar News