Honda: యాక్టివాతో చరిత్ర సృష్టించిన హోండా.. 50 కోట్ల టూ-వీలర్ల ఉత్పత్తి
Honda : జపాన్‌కు చెందిన ప్రముఖ టూ-వీలర్ల కంపెనీ హోండా, ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది.
Honda : యాక్టివాతో చరిత్ర సృష్టించిన హోండా.. 50 కోట్ల టూ-వీలర్ల ఉత్పత్తి
Honda : జపాన్‌కు చెందిన ప్రముఖ టూ-వీలర్ల కంపెనీ హోండా, ప్రపంచవ్యాప్తంగా ఒక సరికొత్త మైలురాయిని చేరుకుంది. 1949లో మొదలుపెట్టి ఇప్పటివరకు ఏకంగా 50 కోట్ల కంటే ఎక్కువ టూ-వీలర్లను ఉత్పత్తి చేసి హోండా చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే టూ-వీలర్ల ఉత్పత్తిలో ఇది ఒక అద్భుతమైన ఘనత. ఈ భారీ సంఖ్యలో చివరి యూనిట్, అంటే 50 కోట్లను దాటిన మొదటి టూ-వీలర్. మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని విఠల్‌పూర్ ప్లాంట్ నుంచే తయారైంది. అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మైలురాయి మోడల్ మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ అయిన హోండా యాక్టివా కావడం విశేషం. ఇది భారతీయ మార్కెట్‌కు హోండా ఇస్తున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
హోండా కంపెనీ భారతీయ మార్కెట్‌పై ఎంత నమ్మకంతో ఉందో ఈ మధ్య ప్రకటించిన పెట్టుబడులు స్పష్టం చేస్తున్నాయి. హోండా భారతీయ మోటార్‌సైకిల్ ఉత్పత్తి విభాగం గురువారం ఒక కీలక ప్రకటన చేసింది. గుజరాత్‌లోని విఠల్‌పూర్ ప్లాంట్‌లో నాలుగో ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేయడానికి ఏకంగా 920 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఉత్పత్తి లైన్ పూర్తయితే, ఇది ప్రపంచంలోనే హోండా మోటార్‌సైకిల్స్‌కు అతిపెద్ద అసెంబ్లీ ప్లాంట్‌గా మారనుంది. 2027 నాటికి ఈ కొత్త ఉత్పత్తి లైన్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించాలని హోండా ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త లైన్ ద్వారా సంవత్సరానికి 6.50 లక్షల యూనిట్ల టూ-వీలర్లను ఉత్పత్తి చేయవచ్చు. దీనితో ఈ ప్లాంట్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 26.1 లక్షల యూనిట్లకు పెరుగుతుంది. ఈ కొత్త ఉత్పత్తి లైన్ ద్వారా సుమారు 1800 కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయి.
ప్రస్తుతం హోండాకు భారతదేశంలో నాలుగు ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 61.4 లక్షల యూనిట్లు. 2001లో భారత్‌లో హోండా ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత 25 సంవత్సరాలకు, ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం ఉత్పత్తి 7 కోట్ల యూనిట్లకు చేరుకుంది. విఠల్‌పూర్‌లోని నాలుగో ఉత్పత్తి లైన్‌తో పాటు, భారతదేశంలోని ఇతర ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా 2027 నాటికి 61.4 లక్షల యూనిట్ల నుంచి దాదాపు 70 లక్షల యూనిట్లకు పెంచాలని హోండా ప్లాన్ చేస్తోంది. దీనికి విరుద్ధంగా పాకిస్తాన్‌లోని అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అయిన అట్లాస్ హోండా, కరాచీ, షేక్‌పురాలోని ప్లాంట్ల నుంచి సంవత్సరానికి 13.5 లక్షల యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయగలదు. అంటే, పాకిస్తాన్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం కంటే భారత్‌లో హోండా ఉత్పత్తి సామర్థ్యం మూడు రెట్లు ఎక్కువ అని చెప్పొచ్చు. ఇది భారత్ హోండాకు ఎంత ముఖ్యమో స్పష్టం చేస్తుంది.
హోండా కేవలం పెట్రోల్ టూ-వీలర్లకే పరిమితం కావడం లేదు. భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే అని గుర్తించి.. ఆ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గత ఏడాది నవంబర్‌లో యాక్టివా ఇ (Activa e, క్యూసీ1 (QC1) మోడళ్లను విడుదల చేయడం ద్వారా ఎలక్ట్రిక్ టూ-వీలర్ల విభాగంలోకి ప్రవేశించింది. బ్యాటరీతో నడిచే వాహనాలను ప్రజలు ఎక్కువగా స్వీకరించేలా సమతుల్య విధానాన్ని అవలంబిస్తున్నామని హోండా చెబుతోంది. 2028 నాటికి భారతదేశంలో ఒక కొత్త ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని హోండా ప్లాన్ చేస్తోంది. ఇది హోండాకు భారతీయ వినియోగదారులకు మరింత సరసమైన ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోడళ్లను అందించడానికి సహాయపడుతుంది.