YSRCP MLCs Resignation: వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలపై మూడో రోజూ కొనసాగనున్న విచారణ
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలపై మండలి చైర్మన్ విచారణ కొనసాగుతోంది. విచారణకు హాజరైన నేతలు తమ రాజీనామాలను ఆమోదించాలని కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
YSRCP MLCs రెసిగ్నషన్ issue
YSRCP MLCs Resignation: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీల రాజీనామాల వ్యవహారంపై శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు విచారణను వేగవంతం చేశారు. వైసీపీకి రాజీనామా చేసి, ఇతర పార్టీల్లో చేరిన ఎమ్మెల్సీలు తమ పదవులకు కూడా రాజీనామాలు సమర్పించగా, ఆ రాజీనామాల ఆమోదంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు చైర్మన్ ఈ విచారణను చేపడుతున్నారు. ఈ క్రమంలో, ఫిబ్రవరి 25, 26 తేదీలలో వరుసగా విచారణకు హాజరు కావాలని సంబంధిత ఎమ్మెల్సీలకు చైర్మన్ నోటీసులు జారీ చేశారు.
గతంలోనే రాజీనామా చేసిన ఐదుగురు ఎమ్మెల్సీలను గత డిసెంబరులో ప్రాథమికంగా విచారించిన చైర్మన్, ఇప్పుడు రెండోసారి కీలక విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 25న జయమంగళ వెంకట రమణను, ఫిబ్రవరి 26న బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీలను చైర్మన్ విచారించారు. ఈ విచారణ సందర్భంగా, తమ రాజీనామాలపై ఎవరి ఒత్తిడి లేదని, తాము స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నామని, వెంటనే రాజీనామాలను ఆమోదించాలని ఎమ్మెల్సీలు చైర్మన్‌ను కోరారు.
ఇదీ జరిగింది..
YSRCP MLCs Resignation: 2024 ఆగస్టు నుండి మొదలుకొని వివిధ సమయాల్లో పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకట రమణ, మర్రి రాజశేఖర్ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు సమర్పించారు. అయితే, పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదులు,ఇతర కారణాల వల్ల వీటి ఆమోదంలో జాప్యం జరుగుతూ వచ్చింది. దీంతో జయమంగళ వెంకట రమణ వంటి నేతలు కోర్టును కూడా ఆశ్రయించగా, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కోర్టు చైర్మన్‌కు సూచించింది.
అయితే, జకియా ఖానమ్ పదవీకాలం ఈ ఏడాది జూలైతో ముగియనున్న నేపథ్యంలో, ఆమెను ఈ విచారణ ప్రక్రియలోకి పిలిచే అవకాశం లేదని సమాచారం. శాసనమండలిలో ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యం ఉన్నందున, ఈ ఐదుగురు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదం పొందితే ఆ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మండలిలో బలబలాల సమీకరణలు మారే అవకాశం ఉండటంతో, చైర్మన్ తీసుకునే తుది నిర్ణయం కోసం రాష్ట్ర రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
YSRCP MLCs Resignation: ఈ పరిణామాల నేపథ్యంలో, రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు తమ నిర్ణయానికి కట్టుబడి ఉండగా, మండలి చైర్మన్ మాత్రం చట్టపరమైన నిబంధనలను అనుసరిస్తూ విచారణను కొనసాగిస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాగానే చైర్మన్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.