Ayesha Meera Case: 19 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు.. ఈరోజు తెనాలిలో ఆయేషా మీరా అంతిమ సంస్కారాలు
Ayesha Meera Case: 19 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత ఆయేషా మీరా హత్య కేసు అధికారికంగా ముగిసింది. ఈరోజు తెనాలిలో ఆమె శరీర అవశేషాలకు అంత్యక్రియలు చేస్తున్నారు.
Ayesha Meera Case
Ayesha Meera Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సుదీర్ఘ న్యాయ పోరాటం ముగిసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు విజయవాడలోని సీబీఐ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా, రీ-పోస్టుమార్టం ప్రక్రియ కోసం గతంలో సేకరించిన ఆయేషా మీరా శరీర అవశేషాలను ఆమె తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఈరోజు అంటే ఫిబ్రవరి 27న తెనాలిలోని ఖబర్‌స్తాన్‌లో ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆయేషా శరీర అవశేషాలను ఖననం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కేసు నేపథ్యం:
Ayesha Meera Case: 2007, డిసెంబర్ 27న విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా దారుణంగా హత్యకు గురయ్యారు. హాస్టల్ గదిలో ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసింది. దర్యాప్తులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. తొలుత సత్యం బాబును నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు.
శిక్ష అనుభవించిన సత్యం బాబు
ఈ కేసును మొదట స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే, దర్యాప్తులో అనేక అస్పష్టతలు చోటుచేసుకున్నాయి. ప్రాథమికంగా అనేక అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, 2008లో పోలీసులు సత్యం బాబు అనే వ్యక్తిని ఈ హత్య కేసులో నిందితుడిగా అరెస్టు చేశారు. పోలీసుల వాదన ప్రకారం, సత్యం బాబు ఆయేషాను వేధించి, ఆ తర్వాత హత్య చేశాడని ఆరోపించారు. 29 సెప్టెంబరు 2010న విజయవాడ మహిళా కోర్టు హత్యకు గాను 302 సెక్షను క్రింద 14 ఏళ్ళ జైలు శిక్ష, మానభంగానికి గాను 376 సెక్షను క్రింద 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అయితే, తనను పోలీసులు అక్రమంగా ఇరికించారని, అసలైన హంతకులను కాపాడేందుకు తనను బలిపశువును చేశారని సత్యం బాబు చెప్పాడు. ఇదే విషయంపై, ఆయేషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలు కూడా సత్యంబాబు నిర్దోషి అంటూ మొదటి నుండి చెబుతూ వచ్చారు.
సుదీర్ఘ పోరాటం - సత్యం బాబు విడుదల
Ayesha Meera Case: సత్యం బాబు తరఫున ఆయేషా తల్లిదండ్రులు తీవ్రంగా పోరాడారు. ఈ క్రమంలో 31 మార్చి 2017న హైదరాబాదు హై కోర్టు సత్యం బాబు ను నిర్దోషిగా ప్రకటించినది. నిష్కారణంగా ఒక నిర్ధోషిని 8 ఏళ్ళు జైలులో ఉంచినందుకు పోలీసు యంత్రాంగానికి మొట్టికాయలు వేస్తూ లక్ష రూపాయలను నష్టపరిహారం విధించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, సత్యం బాబు నిర్దోషి అని తేల్చి విడుదల చేసింది. దర్యాప్తులో పోలీసులు ఘోర వైఫల్యాలు ప్రదర్శించారని, ఆధారాలను సేకరించడంలో నిర్లక్ష్యం వహించారని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
ఫలితం ఇవ్వని సీబీఐ ఎంట్రీ..
Ayesha Meera Case: సత్యం బాబు విడుదలైన తర్వాత, హైకోర్టు ఆదేశాల మేరకు కేసును సీబీఐకి అప్పగించారు. దాదాపు ఏడేళ్ల పాటు సీబీఐ విచారణ చేపట్టింది. కానీ, దురదృష్టవశాత్తూ దశాబ్ద కాలం గడిచిపోవడంతో డీఎన్ఏ ఆధారాలు, ఘటనాస్థలంలోని సాక్ష్యాలు దెబ్బతిన్నాయని సీబీఐ నివేదిక ఇచ్చింది. సరైన ఆధారాలు లభ్యం కాకపోవడంతో, కేసును మూసివేస్తున్నట్లు (Closure Report) సీబీఐ కోర్టుకు నివేదించింది. సీబీఐ కేసును ముగించడంతో ఆయేషా తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. నిందితులను గుర్తించడంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయని, 19 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడినా చివరకు నిరాశే మిగిలిందని ఆయేషా తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో గతంలో రీ-పోస్టుమార్టం కోసం భద్రపరిచిన ఆయేషా శరీర అవశేషాలను తిరిగి వారికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ సుదీర్ఘ పోరాటంలో నిందితులు ఎవరనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
ఈరోజు అంతిమ వీడ్కోలు:
కోర్టు ఆదేశాల మేరకు, సీబీఐ అధికారులు శరీర అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా పలువురు న్యాయవాదులు, మహిళా, విద్యార్థి సంఘాలు "చలో తెనాలి"కి పిలుపునిచ్చాయి. తెనాలిలో మతపరమైన ఆచారాలతో ఆయేషాకు ఆఖరి వీడ్కోలు పలకనున్నారు. దశాబ్ద కాలంగా న్యాయం కోసం తపించిన ఆ తల్లిదండ్రులకు ఇది అత్యంత బాధాకరమైన రోజని స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు.