Janhvi Kapoor : మీరు ట్రూ లీడర్ సార్ ..లోకేష్‌ చేసిన పనికి జాన్వీ కపూర్ ఫిదా

Janhvi Kapoor : లోకేష్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో వైరల్ వ్యాఖ్యలు

Update: 2026-02-26 09:58 GMT

Janhvi Kapoor : మీరు ట్రూ లీడర్ సార్ ..లోకేష్‌ చేసిన పనికి జాన్వీ కపూర్ ఫిదా 

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఒక సాహసోపేతమైన, మానవీయ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. రాజకీయాలకు అతీతంగా, ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు ఆయన చూపిన చొరవపై సామాన్యుల నుండే కాకుండా, సినీ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక SMA టైప్-1 అనే అత్యంత అరుదైన , ప్రమాదకరమైన జన్యు వ్యాధితో పోరాడుతోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కండరాలు క్రమంగా బలహీనపడి, శ్వాస తీసుకోవడం కూడా కష్టతరమవుతుంది. ఈ వ్యాధికి చికిత్స అందించాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'జోల్గెన్స్మా' అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. దీని ఖరీదు అక్షరాలా రూ. 16 కోట్లు.

ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇది ఊహకందని మొత్తం. అయినప్పటికీ, పునర్విక తల్లిదండ్రులు ఆశ వదలకుండా క్రౌడ్ ఫండింగ్ ద్వారా విరాళాలు సేకరించారు. దాతల సహకారంతో రూ. 10 కోట్లు పోగయ్యాయి. కానీ, ఇంకా రూ. 6 కోట్లు తక్కువయ్యాయి. ఈ క్లిష్ట సమయంలో అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్, ఆ మిగిలిన రూ. 6 కోట్లు సమకూర్చే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చారు.

లోకేష్ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో భారీ స్పందనను రాబట్టింది. 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తార జాన్వీ కపూర్, లోకేష్ ఉదారతకు ఫిదా అయ్యారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ..మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఇది నిజంగా ప్రశంసనీయమైన కార్యం అని పేర్కొంటూ నారా లోకేష్‌ను ట్యాగ్ చేశారు.

గతంలో ఎన్టీఆర్ సరసన అలరించిన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. షూటింగ్ బిజీలో ఉన్నప్పటికీ, సామాజిక అంశాలపై ఆమె స్పందించిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఒక చిన్నారి ప్రాణం కోసం ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు ఇంత వేగంగా స్పందించడం అరుదుగా జరుగుతుంటుంది. లోకేష్ స్పందనతో పునర్విక కుటుంబంలో కొత్త ఆశలు చిగురించాయి.

చిన్నారి పునర్విక పోరాట పటిమ అభినందనీయం, ఆమె ప్రాణాలను కాపాడటం మనందరి బాధ్యత అని లోకేష్ పేర్కొనడం ఆయనలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం.. కానీ ఇలాంటి ప్రాణసంకట స్థితిలో ఉన్న వారికి అండగా నిలబడటం నిజమైన నాయకత్వ లక్షణమని ప్రజలు కొనియాడుతున్నారు. పునర్విక త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు వెల్లువెత్తుతున్నాయి. 




Tags:    

Similar News