Jal Jeevan Mission AP : ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం..పల్లె ప్రజల దాహార్తికి చెక్
ఏపీలో మరో కొత్త పథకానికి శ్రీకారం..పల్లె ప్రజల దాహార్తికి చెక్
Jal Jeevan Mission AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా జల జీవన్ మిషన్ పథకానికి కొత్త ఊపిరి పోసింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, నిధుల వినియోగంలో వైఫల్యం చెందడం వల్లే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య జటిలమైందని ఆయన విమర్శించారు. అయితే, ప్రజల కష్టాలను గుర్తించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించి, సమర్థవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
జల జీవన్ మిషన్ కేవలం ఒక పథకం మాత్రమే కాదు, గ్రామీణ మహిళల కష్టాలను తీర్చే ఒక బృహత్తర యజ్ఞం. మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇంటి ముంగిటకే కుళాయి కనెక్షన్ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ స్కీమ్‌ను ప్రారంభించగా, ప్రధాని నరేంద్ర మోదీ దీనిని 2028 వరకు పొడిగించారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో సమానంగా భరిస్తాయి. దీనివల్ల పల్లెల్లో మంచినీటి ఎద్దడి శాశ్వతంగా తొలగిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి పల్లెలో, ప్రతి గడపకు తాగునీటి కనెక్షన్ ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శాసనమండలిలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. పథకం అమలులో పారదర్శకత పాటిస్తున్నట్లు చెప్పారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంతో పాటు, కొత్తగా కుళాయి కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేశామని తెలిపారు. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలైతే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు నీటి కోసం క్యూ కట్టాల్సిన అవసరం ఉండదని, వారి సమయం ఆదా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం వివరిస్తోంది. తాగునీటి సమస్య లేని ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే తమ అంతిమ లక్ష్యమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.