వివేకా హత్య కేసుతో వైసీపీకి చిక్కులు.. అవినాష్‌ అరెస్ట్‌ అయితే..

YSR Congress Party: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది.

Update: 2023-04-18 09:22 GMT

వివేకా హత్య కేసుతో వైసీపీకి చిక్కులు.. అవినాష్‌ అరెస్ట్‌ అయితే..

YSR Congress Party: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్‌ 30 లోగా కేసును కొలిక్కి తీసుకొచ్చేందుకు దర్యాప్తును వేగవంతం చేసింది. భాస్కర్ రెడ్డి అరెస్టుతో వివేకా మర్డర్ కేసు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. అన్ని నియోజకవర్గాల్లో పాగా వేయాలని అధికార పార్టీ యాక్షన్ ప్లాన్‌ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు ఒక్క ఛాన్స్ దొరికినా టార్గెట్ 175 అనేది కష్టమే. ఇలాంటి తరుణంలో వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దస్తగిరి స్టేట్‌మెంట్‌తో కేసు దర్యాప్తులో భాగంగా భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేయడం.. అవినాష్‌ రెడ్డికి నోటీసులివ్వడంతో హత్య కేసులో వారి పాత్ర చర్చనీయంగా మారింది. ఇది వైసీపీలో కాస్త గుబులు రేపే విషయమే.

ఇప్పుడు వివేకా హత్య కేసులో తమ్ముడు, బాబాయ్‌ల మీద ఆరోపణలు.. నోటీసులు వస్తుండటం సీఎం జగన్‌కు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకేసులో అవినాష్‌రెడ్డికి సీఎం సపోర్ట్‌ చేస్తే.. కేంద్ర దర్యాప్తు సంస్థలను వ్యతిరేకించినట్లవుతుంది. అలా కాకుండా సైలెంట్‌గా ఉంటే తన ఫ్యామిలీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలుంటాయి. ఈ పరిణామాలు ఇలాంటి పీక్‌ టైమ్‌లో జగన్‌కు తలనొప్పిగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

దస్తగిరి స్టేట్‌మెంట్‌ ఆధారంగా విచారణ జరుపుతున్న సీబీఐ... భాస్కర్‌రెడ్డి అరెస్టుతో దూకుడు పెంచింది. అవినాష్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చిన సీబీఐ అవసరమైతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెబుతోంది. దీంతో డిఫెన్స్‌లో పడ్డ వైసీపీ సీబీఐని టార్గె్ట్‌ చేస్తోంది. దస్తగిరి వాంగ్మూలం తప్ప సీబీఐ దగ్గర ఏం ఆధారాలున్నాయని ప్రశ్నిస్తోంది. సీబీఐ బెదిరింపులతోనే దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారని చెబుతోంది. ఇదే విషయంపై అవినాష్‌ రెడ్డి తరపు లాయర్లు కోర్టులో వాదనలు కూడా వినిపించారు.

ఇక అవినాష్‌ రెడ్డి కూడా సీబీఐ టార్గెట్‌గా విమర్శలు చేశారు. తన ఫ్యామిలీని కావాలనే దోషులుగా చూపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారని చెప్పారు. విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకెళ్తున్నారని వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలన్నారు.

అయితే ఈ కేసులో అవినాష్‌రెడ్డి పాత్ర ఉందని సీబీఐకి తెలుసన్న దస్తగిరి.. అవినాష్ అక్రమాలకు, డ్రామాలకు తెరపడుతుందని హాట్ కామెంట్స్ చేశారు. సీబీఐ తమ పని తాము చేస్తుందని.. మీరు చెప్పినట్లు ఎందుకు విచారణ చేస్తుందని ప్రశ్నించారు. తాను సునీత దగ్గర డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే జైలుకు పోవడానికి సిద్ధమని.. నిరూపించలేకపోతే పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేశారు.

ఇక ఈ పరిణామాల మధ్య ఒకవేళ అవినాష్‌రెడ్డి అరెస్టే జరిగితే ఆ తర్వాత వైసీపీ చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ముందస్తు బెయిల్ కోసం అవినాష్‌ పిటిషన్ వేయడంతో కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఒకవేళ కోర్టులో చుక్కెదురైతే మాత్రం వివేకా హత్య కేసు విషయంలో వైసీపీ ఏం చేస్తుంది..? ఎలాంటి అడుగులు వేస్తుంది..? సీఎం జగన్‌ ఈ విషయంపై స్పందిస్తారా...లేక మౌనం వహిస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది. 

Tags:    

Similar News