War Between Marri and Rajini : చిలకలూరిపేటలో మర్రి-రజనీ సమరమేంటి?

Update: 2020-07-06 09:18 GMT

war between Marri and Rajini : అది పేట. చిలకలూరి పేట. అక్కడ పూటపూటకు, దిమ్మతిరిగే రాజకీయ ఆట. ప్రత్యర్థులతో కాదు, అధికారపక్షంలోనే ఇద్దరు నాయకుల చెడుగుడు రాజకీయం. రజనీ ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టేనని ఎమ్మెల్యే అంటుంటే, మర్రి, మర్రి చెట్టులెక్క, ఇక్కడ తరతరాలుగా సెటిల్డ్‌ అయిన లీడర్‌నంటూ మరో నాయకుడు కళ్లెర్రజేస్తున్నారట. చిలకలూరిపేటలో రజనీ-మర్రిల మధ్య చిటపటల రాజకీయమేంటి? వారి మధ్య బద్దలుకాబోతున్న అగ్నిపర్వతమేంటి?

విడదల రజనీ ఫైర్‌ బ్రాండ్ లీడర్, చిలకలూరిపేట నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన నాయకురాలు. ఎన్నికల్లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఓడించి ఘన విజయం సాధించారు రజనీ. మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట వైసీపీలో సీనియర్ లీడర్. 2004లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. ఎన్నికల ముందు టికెట్ల కోసం వీరి మధ్య యుద్దం జరిగింది, ఇప్పుడు మరోసారి కయ్యం మొదలైంది. 2019లో అనూహ్యంగా తెరపైకి వచ్చి, చిలకూరిపేట ఎమ్మెల్యేగా గెలిచారు విడదల రజినీ. అంగబలం, అర్థబలానికి తోడు జగన్‌ ఊపులో సునాయాస విజయం సాధించారు. పటిష్టమైన సోషల్ మీడియా టీంతో చాలాకొద్దికాలంలోనే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పడ్డారు. నిత్యం వినూత్నమైన రీతుల్లో జనాల్లోకి వెెళుతూ, వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారన్న పేరు తెచ్చుకున్నారు రజని.

అయితే, మర్రి రాజశేఖర్‌ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. పార్టీ స్థాపించిన నాటి నుంచి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. జిల్లా అద్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయినా, ఆర్థికంగా వెనకబాటు కారణంగా, పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా మిగిలిపోయానని ఫీలవుతుంటారు మర్రి. అయితే పార్టీ అండదండలే కాదు, క్యాడర్‌‌ కూడా మర్రి రాజశేఖర్‌కు చెక్కు చెదరలేదంటారు. ఎమ్మెల్యేగా లేకపోయినా, ఫాలోయింగ్ అలాగే వుందంటారు స్థానికులు. ఇప్పటికీ పార్టీ అధిష్టానం నుంచి, ఏ సమాచారమైనా మొదట మర్రి రాజశేఖర్‌కే అందుతుందట. సీనియర్లతో నిత్యం టచ్‌లో వుంటారట. నేతలు ఎవరైనా ముందుగా మర్రిని కలుసుకున్న తర్వాతే, రజనీని కలుస్తారట. ఇదే ఎమ్మెల్యే విడదల రజనీకి అస్సలు నచ్చడం లేదట. ఎమ్మెల్యేనైన తనకు కాకుండా, మర్రికే ప్రాధాన్యత ఇవ్వడమేంటని రగిలిపోతున్నారట రజనీ. మర్రి వర్గీయులన్న ముద్ర ఉన్నవారిని తన కార్యాలయంలోకి రావద్దని కూడా రజనీ నిర్మొహమాటంగా చెప్పేశారట. దీంతో మర్రి వర్గీయులు వేరు కుంపటి పెట్టుకున్నారు.

స్వతంత్ర దినోత్సవ వేడుక కూడా, వీరి మధ్య రగడకు కారణమైంది. ఇండిపెండెన్స్‌ డేతో పాటుగా, మర్రి రాజశేఖర్ జన్మదినం కూడా వచ్చింది. దీంతో మర్రి వర్గీయులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిలో ఎక్కడా కూడా శాసన సభ్యురాలు రజనీ ఫోటో లేకపోవటంతో విభేదాలు మరింతగా భగ్గుమన్నాయి.

ఇదే సమయంలో మున్సిపల్ అధికారులు ఫెక్సీల తొలగింపు చర్యలు చేపట్టారు. దీంతో మర్రి వర్గీయులు, మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని చెప్పటంతో, విడదల రజనీ ఒత్తిడి మేరకు తొలగిస్తున్నారంటూ మర్రి వర్గీయులు ఏకంగా మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. పదవి లేకపోవటం వల్లనే, మర్రి రాజశేఖర్‌కు తగిన గౌరవం దక్కటం లేదన్నది, ఆయనతో పాటుగా ఆయన వర్గీయుల ఆవేదన. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ పెద్దల వద్ద పంచాయితీ పెట్టినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించంతో, ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని మర్రి వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవితో పాటు సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రిపదవి కూడా దక్కుతుందని మర్రి రాజశేఖర్ వర్గం ఆశపడుతోంది. ముందుజాగ్రత్త చర్యగా పార్టీలో అసంతృప్తిని తెరమీదకు తేకుండా, మర్రి వర్గం ప్రస్తుతం సైలెంట్‌గా ఉందని అంటున్నారు. అయితే, ఇదే సైలెన్స్‌, రజనీ వర్గంలో కాకలు రేపుతోందట.

మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి వచ్చినా, మంత్రి పదవి ఇచ్చినా, చిలకలూరి పేటలో మరో పవర్‌ సెంటర్‌ తయారైనట్టేనని రజనీవర్గం ఉడుకుతోందట. ఆయనకు ఎమ్మెల్సీ రాకుండా, తనదైన శైలిలో పావులు కదుపుతున్నారట. అయినా శాసన మండలి రేపోమాపో రద్దు కాబోతోందని, అనవసరంగా టెన్షన్ అవసరం లేదని రజనీకి అనుచరులు సర్దిచెబుతున్నారట. అయితే, మండలి రద్దయ్యేలోపు చాలాకాలం పడుతుందని, ఒకవేళ మర్రికి ఎమ్మెల్సీ ఇస్తే, ఆ‍యన తన పట్టును మరింత పెంచుకుని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన టికెట్‌ను ఎగరేసుకుపోతారేమోనని దిగులు పడుతున్నారట రజనీ. ఇలా రాబోయే కాలంలో ఏం జరుగుతుందో, ఏం జరగదో తెలీదు గానీ, ఇద్దరు నేతలు మాత్రం ఊహల్లో రాజకీయాలను చుట్టేస్తున్నారు. ఒకరు వస్తుందని, మరొకరు రాకుండా చెయ్యాలని రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా వున్న ఇరువరి గొడవలను మరింతగా పెంచిపోషించుకుంటున్నారు. చూడాలి, రానున్న కాలంలో ఏం జరుగుతుందో.


Full View


Tags:    

Similar News