మండలి రద్దయితే వైసీపీలో వీరి పరిస్థితి ఏంటి?

Update: 2020-01-27 01:39 GMT

ఏపీ ప్రభుత్వం శాసనమండలిని కొనసాగించడంపై నేడు కీలక నిర్ణయం తీసుకోనుంది. మండలిని రద్దు దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ఆదివారమే తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవులపై అసలు పెట్టుకున్న నేతలకు భవిశ్యత్ లో కార్పొరేషన్ లేదంటే ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు 2026 సంవత్సరం కల్లా ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఇప్పుడున్న175 స్థానాలను 225 కు పెంచుతారు.

కాబట్టి భవిశ్యత్ లో ఆశావహులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఎమ్మెల్సీలు గా ఉండి ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతోన్న పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి వెంకటరమణలో ఎవరో ఒకరికి రాజ్యసభ అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే మండలి రద్దయితే ఏప్రిల్ లో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో.. ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఆశపెట్టుకున్న నేతలకు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే నలుగురు నేతలకు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. వారిలో చిలకలూరిపేట వైసీపీ నేత మర్రి రాజశేఖర్ తోపాటూ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి , అరకు మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, గొట్టిపాటి భరత్ లు ఉన్నారు.

వీరు కాక ప్రకాశం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి , అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాధ్ రెడ్డి, అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు నదీమ్ అహ్మద్, సినీనటుడు అలీ మాజీ ఎమ్మెల్యేలు దాడి వీరభద్రరావు , మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , యలమంచిలి రవి, ఆమంచి కృష్ణమోహన్, శిల్పా మోహనరెడ్డి తదితరులు ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరితోపాటు ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారికి కూడా మండలి రద్దయితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే వీరిలో కొందరు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తుండటం విశేషం.  

Tags:    

Similar News